Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ గణాంకాలపై సుప్రీం ధర్మాసనం నిలదీత
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూ ఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకు న్న నిర్ణయంపై ఇప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై దాఖలైన పిటిషన్లను ఇదివరకు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకించి నీట్ పరీక్షను రాయదలచుకున్న అభ్యర్థుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వార్షిక ఆదాయాన్ని రూ.8లక్షల నిర్ధారించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అఖిల భారత కోటా కింద రూ.8లక్షల వార్షిక ఆదాయంగా చూపించడంపై పలు అనుమానాలను లేవనెత్తింది. న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ముగ్గురు న్యాయ మూర్తుల ధర్మాసనం విచారణ సందర్భంగా.. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో.. వేర్వేరు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు ఉంటారనీ, వారందరి ఆదాయం రూ.8లక్షల ఎలా నిర్ధారించారని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం వద్ద ఉన్న ఆధారాలేమిటీ? ఏ ప్రాతిపదికన దీన్ని నిర్ధారించారు? దీనికి ఉన్న సమగ్ర డేటా ఏమిటీ? అంటూ కేంద్రంపై ప్రశ్నల పరంపరను సంధించింది. రాష్ట్రాల జీడీపీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వార్షిక ఆదాయాన్ని నిర్ధారించారా? అని ఆయన ప్రశ్నించింది. మెట్రో నగరాల్లో నివసించే వారిని, మారుమూల గ్రామాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వార్షిక ఆదాయం ఒకేరకంగా ఉంటుందా? అంటూ డీవై చంద్రచూడ్ కేంద్రాన్ని నిలదీశారు. దీనిపై విశ్లేషకులు, న్యాయ నిపుణులు సైతం ఇదే తరహా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల కోసం చేసిన సవరణలు రాజ్యాంగా ప్రాథమిక, మౌలిక సూత్రాలకు విరుద్దమన్న అంశాలు సైతం ముందుకు వస్తున్నాయి. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే, సుప్రీంకోర్టు లేవనెత్తిన పలు అంశాలను అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ అందుబాటులో ఉన్న విభిన్న డేటాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. 2011-12 నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం అత్యంత సంపన్నులు 5 శాతం మంది భారతీయుల తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,481, పట్టణ ప్రాంతాల్లో రూ.10,281. అయితే, పట్టణ ప్రాంతాల్లో ఈ కుటుంబాల్లో ఐదుగురు సభ్యులు ఉంటే కుటుంబం నెలవారీ ఆదాయం రూ.51,405 కాగా, వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు. ఇది కొత్త రిజర్వేషన్ కింద నిర్ధేశించిన పరిమితి కంటే 25 శాతం తక్కువ. అంతేకాదు, సమాజిక-ఆర్థిక కుల గణన-2011 ప్రకారం 8.25 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే ఎక్కువ. అలాగే, వ్యవసాయ సెన్సన్ 2015-16 ప్రకారం భారత్లో దాదాపు 86 శాతం భూములు నిర్ధేశిత 5 ఎకరాల కంటే తక్కువగా ఉన్నాయి. 2016 బీసీజీ డేటా ప్రకారం దాదాపు 76 శాతం భారతీయ కుటుంబాల వార్షిక ఆదాయం 7,700 అమెరికన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది. ఆ సమయంలో ఉన్న ఎక్స్ఛేంజ్ రేటు ప్రకారం ఇది రూ.5.15 లక్షలకు సమానం.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ డేటా మొత్తం భారతీయ కుటుంబాలకు సంబంధించినది.. కుల ఆధారిత వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకోదు. ఇదిలావుండగా, 78 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల డేటా ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టులు, సేవలలో ఎస్సీ, ఎస్టీలు, ఒబీసీలు వరుసగా (2016 నాటికి) 17.49 శాతం, 8.47 శాతం, 21.57 శాతం ఉన్నారు. అగ్రవర్ణాలకు చెందినవారు 52.47 శాతం ఉన్నారు. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో మొత్తం 3,85,36,359 మంది నమోదు అంచనా.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వరుసగా 14.7 శాతం, 5.6శాతం, 37 శాతం ఉన్నారు. అంటే 42.7 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారు. అయితే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఏ విధమైన స్పందనలు తెలియజేస్తుం దనేది ఆసక్తిగా మారింది.