Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో మరో ఘనత
తిరువనతంపురం : కేరళలో సీపీఐ(ఎం) శాఖల కార్యదర్శులుగా మహిళలు అధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ శాతం మంది యువత ఉండటం మరింత విశేషం. రాష్ట్రంలోనే వచ్చే ఏడాది 23వ పార్టీ మహాసభలు జరగడానికి ముందు శాఖల కార్యదర్శులుగా యువ మహిళలు అధిక సంఖ్యలో ఎన్నికకావడం ఆనందం కలిగిస్తోంది. కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 345 మంది మహిళలు శాఖ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. గతంలో ఈ సంఖ్య 111 మాత్రమే. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 4192 శాఖ సమావేశాలు పూర్తవయ్యాయి. అలాగే మహిళా శాఖ కార్యదర్శుల విషయంలో 23వ పార్టీ మహాసభలు జరిగే కన్నూర్ జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 163 మంది మహిళలు శాఖ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఈ జిల్లాలోనూ 4192 శాఖ సమావేశాలు పూర్తయ్యాయి. 1875 శాఖలు ఉన్న కసర్గొడ్ జిల్లాలో 120 మంది మహిళలు శాఖ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పాలక్కడ్ జిల్లాలో 145 మంది ఎన్నికయ్యారు. ఈ జిల్లాలో 3063 శాఖలు ఉన్నాయి. 2511 శాఖలు ఉన్న తిరువనంతపురం జిల్లాలో 149 మంది మహిళలు శాఖ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
కొల్లాం జిల్లాలో 204 మంది మహిళా కార్యదర్శులు ఎన్నికయ్యారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 3047 శాఖలకు సమావేశాలు పూర్తయినట్లు సమాచారం. పథనమిథిట్ట జిల్లాలో 1540 శాఖలకు గాను, 116 శాఖలకు మహిళలు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
మిగిలిన జిల్లాలో శాఖల సమావేశాలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో సీపీఐ(ఎం) శాఖల కార్యదర్శులుగా ఇంత భారీ సంఖ్యలో మహిళలు ఎన్నిక కావడం ఇదే మొదటిసారనీ, ఇది అసాధారణమని పలువురు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.