Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : హోం వర్క్ చేయలేదంటూ విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. దెబ్బతాకిడికి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రశ్నించేందుకు వచ్చిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడు విస్తుపోయే సమాధానమిచ్చాడు. ఆ విద్యార్థి చనిపోలేదనీ, నాటకమాడుతున్నాడంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని చురుజిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. సల్సార్ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలుడు స్థానిక ప్రయివేట్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని హోమ్‌వర్క్ చూపించాల్సిందిగా ఉపాధ్యాయుడు మనోజ్ కుమార్ అడిగారు. రాయలేదని చెప్పడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్ధిని చావచితక్కొట్టాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పాఠశాల యాజమాన్యం అతనిని ఆస్పత్రికి తరలించడంతో.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 15 రోజులుగా కారణం లేకుండా తనను కొడుతున్నారంటూ తన కుమారుడు చెప్పాడని బాలుని తండ్రి ఓమ్ ప్రకాష్ పోలీసులకు తెలిపారు. తాను పొలంలో పనిచేస్తుండగా తన కుమారుడు పడిపోయాడంటూ ఫోన్ వచ్చిందనీ.. ఏం జరిగిందని ప్రశ్నించగా.. చనిపోయినట్టు నాటకమాడుతున్నాడని మనోజ్ సమాధానమిచ్చాడని ఓమ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్కూలుకు వచ్చి చూసేసరికి తన కుమారుడు చనిపోయి ఉన్నాడని.. మిగిలిన విద్యార్థులంతా భయంతో చూస్తున్నారని అన్నారు. బాలుడిని మనోజ్ విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు కాలితో తన్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.