Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఆర్
- కేంద్రమంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) 3 శాతం పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ మేరకు డీఏ, డీఆర్ విడుదలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2021 జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఆర్ అదనపు విడత విడుదలకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాథమిక చెల్లింపు / పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 28 శాతానికి మరో మూడు శాతం పెంచింది. ఈ పెరుగుదల ఆమోదించబడిన సూత్రానికనుగుణంగా ఉంటుంది. ఇది 7వ పే కమిషన్ సిఫారసులపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డీఏ, డీఆర్ రెండింటికి రూ .9,488.70 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనివల్ల దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది.
పీఎం గతిశక్తి, ఎన్ఎంపీకు సీసీఈఏ ఆమోదం
మల్టీ మోడల్ కనెక్టివిటీని అందించడానికి సంస్థాగత ఫ్రేమ్‌వర్క్, అమలు, పర్యవేక్షణ, మద్దతు యంత్రాంగంతో సహా పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ)ను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదించింది. గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సీసీఈఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2021 అక్టోబర్ 13న మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ని ప్రధాని ప్రారంభించారు. దీని అమలు ఫ్రేమ్‌వర్క్‌లో ఎంపోవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రెటరీస్ (ఈజీఓఎస్), నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ),టెక్నికల్ సపోర్ట్ యూనిట్ (టీఎస్‌యూ) వంటి మూడంచెల వ్యవస్థతో పర్యవేక్షణ చేయనున్నారు. ఈజీఓఎస్కి క్యాబినెట్ సెక్రెటరీ నేతృత్వం వహిస్తారు.
18 మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. లాజిస్టిక్స్ విభాగం అధిపతి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. స్టీల్, బొగ్గు, ఎరువులు మొదలైన వివిధ మంత్రిత్వ శాఖల అవసరాల మేరకు బల్క్ గూడ్స్‌ను సమర్ధవంతంగా రవాణా చేయడంలో డిమాండ్ మేరకు అవసరమైన జోక్యాన్ని కూడా ఈజీఓఎస్ పరిశీలిస్తుంది. ఏవియేషన్, మారిటైమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రైలు, రోడ్లు, జాతీయ రహదారులు, పోర్టులు మొదలైన వివిధ మౌలిక రంగాలు, అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్, విద్యుత్ వంటి రంగాలను టీఎస్‌యూ చూస్తుంది. ఈ ఆమోదంతో పీఎం గతిశక్తి విడుదల మరింత ఊపందుకుంటుందనీ, దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంపూర్ణమైన, సమగ్రమైన ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ వస్తుందని కేంద్రం తెలిపింది.