Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోలో నవంబర్ 22న భారీ కిసాన్ మహా పంచాయత్
- బీజేపీ నేతలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనలు
- సంయుక్త కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోత సంఘటనలో న్యాయం కోసం అక్టోబర్ 26న లక్నోలో నిర్వహించాల్సిన కిసాన్ మహా పంచాయత్, నవంబర్ 22 నాటికి వాయిదా వేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్ణయం తీసుకుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంట కాలాలను దృష్టిలో ఉంచుకుని ఎస్కేఎం ఈ నిర్ణయం తీసుకుంది. 26న దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. గురువారం నాడిక్కడ సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం సమావేశం జరిగింది. అక్టోబర్ 15న అక్కడ జరిగిన హింసాత్మక ఘటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన వెనుక రైతు ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చే హింసలో కుట్ర దాగి ఉందని తెలిపింది. క్రూరమైన హత్యలో పాల్గొన్న నిహాంగ్ సిక్కు నాయకుడి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి కైలాష్ చౌదరిలను కలిశారనీ, ఆ ఇద్దరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. రైతుల ఉద్యమంపై దాగి ఉన్న కుట్రలను, లోతైన పన్నాగంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ఈ సంఘటనలో పాల్గొన్న నిహాంగ్ సిక్కులతో రైతు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని ఎస్కేఎం మరోసారి స్పష్టం చేసింది. ఈ హత్యలో నిందితులైన గ్రూపులు ఏ ఇతర రైతు ఉద్యమ వేదికల్లో ఉండేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇది రైతు ఉద్యమమనీ, మతపరమైన ఉద్యమం కాదని ఎస్కేఎం పేర్కొంది. అనంతరం పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాల నేతలు సమావేశమై, ఈ ఘటనకు సంబంధించిన నిజనిర్ధారణ నివేదికను సమర్పించడానికి ఐదుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి సరిహద్దులకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకోవాలని పిలుపు ఇచ్చారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. లఖింపూర్ ఖేరీ అమరవీరుల అస్తికలు కిరత్పూర్ సాహిబ్, గోయింద్వాల్ సాహిబ్, హుసైనీవాలా కలపడానికి అక్టోబర్ 24 న పంజాబ్‌లోని మజా, మాల్వా, దోబా ప్రాంతాల్లో 'కలశ యాత్రలు' చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
లఖింపూర్ ఖేరీ అమరవీరుల షహీద్ అస్తికల యాత్రలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ యుపిలోని ముజఫర్ నగర్, మీరట్ వంటి అనేక జిల్లాల గుండా యాత్ర సాగింది. తీర్థనగరి శుక్రతాళ్లో అస్తికలను కలిపారు. యుపిలోని ఇతర ప్రాంతాల నుంచి యాత్ర ప్రయాగరాజ్‌కు చేరుకుంది. అక్కడ పవిత్ర గంగ నదిలో అస్తికలు కలిపారు. హర్యానాలో అనేక జిల్లాల్లో యాత్రలు సాగాయి. భివానీలో పెద్ద సంఖ్యలో రైతులు యాత్రలో చేరారు. కర్నాల్‌లో అనేక గ్రామాల గుండా యాత్ర చేపట్టిన తర్వాత, అస్తికలను పశ్చిమ యమునా కాలువలో కలిపారు. మహారాష్ట్రలో ఈ యాత్ర నాసిక్ చేరుకుంది. ఇక్కడ అస్తికలను రామ్ కుండ్‌లో కలిపారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని 15 జిల్లాల్లో సాగింది. ఉత్తరాఖండ్ గుండా అస్తికలతో ఒక యాత్ర కొనసాగుతుంది. ఇది దోయివాలా టోల్ ప్లాజాకు చేరుకుంది.
బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు అనేక రాష్ట్రాలలో కొనసాగుతున్నాయి. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని పెహౌవా సమీపంలో సుర్మి గ్రామంలో రాష్ట్ర క్రీడా మంత్రి సందీప్ సింగ్‌కు వ్యతిరేకంగా రైతులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. కైథల్‌లో ఎంపీ నాయాబ్ సైనీకి వ్యతిరేకంగా రైతుల నిరసన చేపట్టడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో, జోబాట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నాయకులు స్థానిక రైతులు నల్ల జెండాలతో నిరసనలను ఎదుర్కొన్నారు.