Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌ను వేధిస్తున్న బొగ్గు కొరత..
- ప్రయివేట్‌కు కట్టబెట్టడానికే ఇదంతా: విశ్లేషకులు
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందస్తు ప్రణాళిక చర్యలేవి తీసుకోవటంలేదు. లేదా అదే ప్రణాళికేమో! దీని పర్యవసానంగా దేశప్రజలు ఆర్థిక, ఇతర సమస్యల్లోకి నెట్టివేయబడుతున్నారు. దేశంలో కరోనా ఫస్ట్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో కరోనా సెకండ్‌వేవ్ ముందస్తు హెచ్చరికల్ని గాలికొదిలేసింది. దీంతో ఎంతఅనర్థం జరిగిందో..కరోనా కోరల్లో చిక్కి ఎంతమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో..ఇప్పటికీ పీడకలగా మిగిలింది. తాజాగా విద్యుత్ సమస్య వేధిస్తున్నా...మోడీ సర్కార్ మాత్రం భవిష్యత్ ప్రణాళికలేమి రచించిందో! బొగ్గునిల్వలు తరుగుతుంటే..మళ్లీ కిరోసిన్ బుడ్డీల వెలుగులను ఆశ్రయించక తప్పదా అని సామాన్య,మధ్యతరగతి జనంలో చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న విద్యుత్‌ను కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికే ఇదంతా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొరత కారణంగా ఇటీవల పలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడిన సం గతి తెలిసిందే. రుతుపవనాలు కాస్త తగ్గుముఖం పడు తుండటంతో మళ్లీ గనుల్లో తవ్వకాలు ఊపందుకుంటు న్నాయి. అయితే, భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి దేశంలో విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త మార్గలు అన్వేషించాల్సిన పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. కోవిడ్-19సెకండ్‌వేవ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నం దున విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయితే, భారీ వర్షాలు కురవడం, రుతుపవనాలు ఇంకా కొనసాగడంతో పలు బొగ్గుగనుల్లో నీరు చేరడం, రవాణా మార్గాలకు అం తరాయం ఏర్పడింది. అంతర్జాతీయంగానూ బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో దేశంలో బొగ్గు కొరత మరిం తగా తీవ్రతరమైంది. అయితే, ప్రభుత్వ యంత్రాంగం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. దీని కారణంగా విద్యుత్ కోతలు, పలుచోట్ల చార్జీల పెంపునకు పరిస్థితులు దారి తీశాయి.
అయితే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాలో ముందస్తు ప్రణాళికలు రూపొందించడంతో విద్యుత్ కోసం కొత్త మార్గల అన్వేషించాల్సిన అవసరముందనీ, కేవలం థర్మల్, జల విద్యుత్‌పైనే ఆధారపడుతున్న పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో అక్టోబర్‌లో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది. అయితే, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందించడానికి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేయలేదు. దీనికి తోడు విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం మన దేశంలోనే కాకుండా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. చైనాలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, దేశంలోని కార్బన్ ఉద్గారాల తగ్గింపు కారణంగా బొగ్గు సరఫరాను నిలిపివేసింది.
దీనికితోడు రాజకీయ వివాదం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతులను నిలిపివేయడానికి దారితీసింది. ఇక అమెరికా, ఐరోపాలలో సహజ వాయువు ధర పెరగడం వలన పలువురు విద్యుత్ ఉత్పత్తిదారులు బొగ్గుకు మారడానికి ప్రేరేపించబడ్డారు. సహజ వాయువుకు ప్రత్యామ్నాయంగా బొగ్గు డిమాండ్ పెరిగినప్పటికీ, సరఫరా వేగాన్ని అందుకోలేకపోయింది. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతున్నాయి. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వాటా 2019లో 61.9 శాతం ఉండగా, ప్రస్తుతం 66.4 శాతానికి పెరిగింది.
అయితే, విద్యుత్ కోసం కేవలం బొగ్గుపై మాత్రమే కాకుండా, సహజవాయువు, విండ్‌పవర్, సోలార్‌పవర్ వంటి ఇతర ప్రత్యామ్నాయాలకు మారాలని పేర్కొంటున్నారు. ఇది నాణేనికి ఓ వైపు అయితే.. మరోవైపు బొగ్గు గనుల్ని ప్రయివేట్‌కు కేంద్రం కట్టబెడుతున్నది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు గనుల్ని అక్కడి ప్రభుత్వాలను మాట వరసకైనా చెప్పటంలేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాను తమ చెప్పుచేతల్లో ఉంచుకున్న అదానీ, అంబానీ లాంటి పెద్దలకు ఇవ్వటానికే కేంద్రం చేస్తున్నదని ఆర్థికనిపుణుల వాదన. ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్నదని అమ్మేసినట్టు..దేశవ్యాప్తంగా విద్యుత్ ను ముక్కలుగా చేసి కార్పొరేట్ల చేతుల్లోకి తీసుకెళ్లేందుకే మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నదన్న చర్చ నడుస్తున్నది.