Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక: సాంప్రదాయవాద ఆదర్శాల పేరిట స్వయంప్రతిపత్తి అనే భావన కనుమరుగవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలను కట్టుబాట్లు, ఆచారాల పేరిట వారిపై జరుగుతున్న హింస, వివక్ష బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా పెరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రకమైన ధోరణి మహిళల మనుగడను సైతం ప్రశ్నించే స్థాయికి చేరిందంటే పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో అర్థంచేసుకోవచ్చు. బీజేపీ నాయకులైతే ఒకరిని మించి మరోకరు పోటీపడి మరి మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులోని జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరోలాజికల్ సైన్సెస్ (నిమ్హాన్స్)లో జరిగిన కార్యక్రమంలో కర్నాటక ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ మాట్లాడుతూ.. ఃఆధునిక భారత మహిళల్లో చాలా మంది ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. వివాహం చేసుకున్నప్పటికీ పిల్లలకు జన్మనివ్వడానికి ఇష్టపడటం లేదు. వారికి సరోగసీ కావాలి.. కాబట్టి మన ఆలోచన విధానంలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదుః అంటూ చెప్పుకొచ్చారు. ఇలా విచిత్రమైన, సంబంధంలేని విషయాలకు జాతీయ కుటుంబ సర్వేలు లేదా స్థానిక సమాచారమూ ఆధారంకాదు. ఇక మంత్రిగారు చేసిన వ్యాఖ్యలకు తోడుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిటి.రవి సైతం మహిళలందరూ అలా ఉండరూ అంటూనే.. ఆధునిక మహిళలు.. ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి విభాగాల్లో పనిచేస్తున్న వారు మాత్రమే ఆలా నివసిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న వారు, అధికార పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మహిళలకు వారిచ్చే ప్రాధాన్యతపై ప్రశ్నలను లేవదీస్తున్నాయి. ప్రభుత్వ నేతలే మహిళలను కించపరిచేలా, వారిపై ఒక విధమైన మానసిక ఒత్తిడిని తీసుకువచ్చే విధంగా వ్యాఖ్యలు చేయడం.. మహిళపై దాడులు పెరగడానికి దారితీస్తున్నదని ఇప్పటికే పలు సర్వేలతో పాటు సామాజిక విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కర్నాటకలో భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన, హిందూ జాగరణ వేదిక వంటి గ్రూపులు మతాంతర సంబంధాల్లో జోక్యం చేసుకోవడంపై పరిమితులు మించిపోతుండటంతో హింసాత్మక ఘటనలు సైతం పెరుగుతున్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల బుర్ఖా ధరించిన ఓ మహిళను తనిఖీ చేయడాన్ని మోరల్పోలిసింగ్ పేరిట సగర్వంగా పంచుకున్న ఆయన వారి మంత్రులు, నేతలు ఆధునీక మహిళలు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను సమర్థించడానికి మొగ్గుచూపడం గమనార్హం. ఇక మైసూర్లో చోటుచేసుకున్న సామూహిక లైంగికదాడిపై హౌం మంత్రి అరగా జ్ఞానేంద్ర మొదట స్పందించినపుడు బాధితురాలిని అవమానిస్తూ.. తప్పు బాధితురాలిదే అంటూ నిందించడానికి సైతం వెనుకాడలేదు. 6 గంటల తర్వాత విద్యార్థినులు హాస్టళ్లకే పరిమితం కావాలనే సూచననున నొక్కి చెప్పారు. (ఆ ఆర్డర్ తర్వాత ఉపసంహరించుకోబడింది). అయితే, దేశంలో ఏండ్ల నుంచి మహిళల హక్కుల, అభివృద్ధిపై చర్చలు కొనసాగుతున్నాయి. పాలకులు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రత్యేకించి మహిళలు విద్య, ఉద్యోగాలు, సురక్షితమైన బహిరంగ ప్రాంతాలను కోరుకుంటున్నారు. ఐటీకి హబ్‌గా ఉన్న బెంగళూరులో మహిళా ఉద్యోగుల సంఖ్య అధికంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటక బీజేపీ నేతలు వ్యాఖ్యలు, ప్రభుత్వం నిర్ణయాలు మహిళల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో గృహహింస, మహిళలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు సంబంధించి సేవలు అందిస్తున్న 187కు పైగా సాంత్వన కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించడం వాటిల్లో ఒకటి.
2020-నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం మహిళలపై 30 శాతం నేరాలు కుటుంబ సభ్యులు ద్వారా జరిగాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం భార్యభర్తల మధ్య చోటుచేసుకుంటున్న హింస 20.6 శాతం పెరిగి 44.4 శాతానికి పెరిగింది. ప్రమాదంలో ఉన్న సంస్కృతి, సమాజం అనే అంశాలు హైలెట్ చేసి చూపిస్తున్న క్రమంలో మహిళలపై దారుణాలు, హింస పెరుగుతోంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఇల్లు ఒకటని న్యాయస్థానాలు సైతం రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. 2015 నుంచి వచ్చిన వివిధ నివేదికలను గమనిస్తే రాష్ట్రంలో మహిళల మానసిక ఆరోగ్యానికి సాంత్వన కేంద్రాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేస్తున్నాయి. వీటి సేవలను వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, ముస్లింలు, షెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉపయోగించుకున్నాయి. ప్రభుత్వ, బీజేపీ నేతల తీరుపై ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.