Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో దర్యాప్తులు నిర్వహించకుండా సీబీఐని కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ శక్తి ఆపలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. సీబీఐపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటీషన్ విచారణ సందర్భంగా శుక్రవారం కేంద్రం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో టీఎంసీ నేతలు లక్ష్యంగా, సమాఖ్య నిర్మాణం దెబ్బతీసే విధంగా సీబీఐ వ్యవహరిస్తుందని బెంగాల్ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ పిటీషన్ విచారణలో కేంద్రం తన అఫిడవిట్లో ఈ విషయాలన్ని తెలిపింది. రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు నిర్వహించకుండా నిలిపివేసే అధికారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేదనీ, ప్రధానంగా కొల్కత్తా హైకోర్టు బదిలీ చేసిన ఎన్నికల అనంతర హింస కేసు దర్యాప్తు చేయకుండా ఆపే అధికారం లేదని కేంద్రం తెలిపింది. ''రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరని కనుగొన్న'' కేసులను సీబీఐకి అప్పగించడానికి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవడం ఆటంకం కలిగించదని కేంద్రం పేర్కొంది. అలాగే, రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో యూనియన్ జాబితాలో పేర్కొన్న ఏవైనా కేంద్ర ప్రభుత్వ అంశాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడానికి సిబిఐకి అధికారం ఉందని, దర్యాప్తులో ఉన్న ఆరోపణలు పార్లమెంటరీ చట్టాల ప్రకారం నేరాలు అని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. శుక్రవారం ఈ విచారణను జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బి ఆర్ గవైలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో వాదనలు వివరంగా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబర్ 16కి వాయిదా వేసింది.