Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బొగ్గు కొరత నేపథ్యంలో అనేక రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో కోల్ ఇండియా నుంచి బొగ్గు సరఫరా పెంచామని, రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం కోల్ ఇండియా పరిధిలోని బొగ్గు గనుల్లో ఉత్పత్తి అవుతున్న దాంట్లో 91శాతానికిపైగా దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తరలుతోందని తెలిసింది. వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న గనుల్లో బొగ్గు తవ్వకాలను వేగవంతం చేశామని తద్వారా ప్రస్తుతం ఏర్పడిన కొరతను పరిష్కరిస్తామని కేంద్రం తెలిపింది. కోల్ ఇండియాకు చెందిన 8 మైనింగ్ కంపెనీలు, ఒడిషాలోని మహానంది బొగ్గు క్షేత్రం నుంచి పెద్దమొత్తంలో బొగ్గు సరఫరా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. బొగ్గు గనులకు చాలా దూరంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లకు బొగ్గును చాలా వేగంగా సరఫరా చేయాలని, పెద్ద సంఖ్యలో రైల్వే వ్యాగన్లను సమకూర్చుకోవాలని రైల్వే శాఖకు ఆదేశాలు పంపామని కేంద్రం తెలిపింది. అయితే కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, దేశంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పరిమితంగా ఉన్నాయని, 5-7రోజుల వరకు అవి సరిపోతాయని తెలిపింది.