Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్లో క్రైస్తవులపై దాడులు పెరిగాయని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఏడాది 9నెలల కాలంలో దేశవ్యాప్తంగా క్రైస్తవులపై 300కిపైగా దాడి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపాయి. క్రైస్తవుల్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులపై మానవ హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాయి. ఛత్తీస్గఢ్లో చర్చీలపై, క్రైస్తవులపై దాడులు పెరిగాయని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ద గార్డియన్' వార్తా కథనాలు వెలువరించింది. మతపరమైన దాడి ఘటనలు 21 రాష్ట్ర్రాల్లో నమోదయ్యాయని, హిందూత్వ అతివాద గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నాయని నివేదికలో తెలిపారు. ఉదాహరణకు, అక్టోబర్ 3న ఉత్తరాఖండ్లో హిందూత్వగ్రూప్నకు చెందిన 200మంది రూర్కీలో ఒక చర్చీపై దాడికి తెగబడ్డారు. అక్కడ ప్రార్థనకోసం వచ్చిన మహిళల్ని, ఇతరుల్ని విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడి ఘటనపై పోలీసు కేసు నమోదు చేసినా...నిందితులను మాత్రం అరెస్టు చేయలేదు. ఇలాంటి మతపరమైన దాడులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ సివిల్ రైట్స్, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, యునైటెడ్ అగెయినెస్ట్ హేట్...సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నాయి.
ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తున్నట్టు ?
- ఎ.సి.మైఖేల్, నేషనల్ కోఆర్డినేటర్, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం
క్రైస్తవంలోకి మారిన హిందువుల్ని, ముఖ్యంగా దళితులు, గిరిజనుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. మతపరమైన దాడులు 21రాష్ట్రాల్లో జరిగాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో దాడులు చోటుచేసుకున్నాయి. వందలాది మందితో హిందూత్వ గ్రూపులు ఒక ముఠాగా ఏర్పడి దాడిచేసిన ఘటనలు 288 వరకు ఉన్నాయి. ఇంతపెద్ద సంఖ్యలో ఓ వైపు దాడులు జరుగుతున్నా..'జాతీయ మానవ హక్కుల కమిషన్'(ఎన్హెచ్ఆర్సీ) ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. దాడుల్ని ఆపటంలో హక్కుల కమిషన్, కేంద్ర హోం శాఖ విఫలమైంది. దాడులకు సంబంధించిన పోలీస్ స్టేషన్లలో 49 ఎఫ్ఐఆర్లు రిజిష్టరయ్యాయి, కానీ ఏ కేసులోనూ చర్యలు లేవు. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటకలో చర్చీలపై, క్రైస్తవులపై దాడులు పెరిగాయని మీడియా కథనాలే చెబుతున్నాయి.