Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్‌పై అత్యవసర విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈ కమ్యూనిటీ కిచెన్లు అనే అంశం మరింత ముఖ్యమైన, అవసరమైన అంశంగా మారిందని పిటిషన్‌దారు పేర్కొన్నారు. దేశంలో ఆకలి, పోషకారహార సమస్య తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించి ఒక పథకాన్ని రూపొందించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరారు. పిటిషన్‌దారుల తరపు న్యాయవాది ఆషిమా మందల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై ఈ నెల 27న విచారణ చేపడుతామని పేర్కొంది. ఇంతకుముందే దీనిపై నోటీసులు కూడా జారీచేశామని, ఆ సమయంలో తానే ధర్మాసనానికి నేతృత్వం వహించానని జస్టిస్ రమణ తెలిపారు. పిల్‌పై స్పందించాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు గతేడాది ఫిబ్రవరి 17న ఆరు (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, గోవా, ఢిల్లీ) రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. పిల్‌పై స్పందన తెలియజేసిన రాష్ట్రాల జాబితాను తయారు చేయాలని న్యాయవాది అషిమాకి తాజాగా ధర్మాసనం సూచించింది.
దేశంలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో 69 శాతం మంది పోషకాహారలోపం కారణంగా చనిపోతున్నారని అషిమా ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితి పౌరుల ఆహారం, జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు రాష్ట్రాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అదేవిధంగా పీడీఎస్ పరిధిలోకి రానివారి కోసం ఒక నేషనల్ ఫుడ్ గ్రిడ్‌ను ఏర్పాటుచేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సుప్రీంకోర్టు 2019, ఆక్టోబర్ 18న సానుకూలత వ్యక్తం చేసింది. దేశంలో ఆకలి, పోషకాహార సమస్యను ఎదుర్కోవాలంటే ఇటువంటి ఒక వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. దీనిపై సంబంధించిన దాఖలైన పిల్‌పై స్పందించాలని ఆదేశిస్తూ రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీచేసింది.