Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హౌదా దక్కనున్నది. ఈ హౌదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం వారికి శాశ్వత కమిషన్ హౌదా కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. సైన్యంలో 14ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హౌదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పువెలువరించింది. దీంతో సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హౌదా కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్) సమీక్షను ఆధారంగా చేసుకుని కొందరికి ఈ హౌదా ఇచ్చింది. దీంతో శాశ్వత కమిషన్ తిరస్కరణకు గురైన 71 మంది అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షం, అన్యాయంగా ఉందని ఆరోపిస్తూ పలు అంశాలను తమ పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏసీఆర్ విధానాన్ని అనుసరించడం వివక్షపూరితమే అని అభిప్రాయపడింది. దీనిపై కేంద్రం స్పందన అడిగిన న్యాయస్థానం.. అప్పటిదాకా ఈ 71 మంది మహిళా అధికారులను సర్వీసు నుంచి తొలగించొద్దని ఆదేశించింది. దీంతో కేంద్రం నేడు తమ స్పందన తెలియజేసింది. ఈ 71 మందిలో 39 మంది మహిళా అధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరనీ, ఇక మిగతా 25 మందిపై తీవ్రమైన క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది. కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆ 39 మందికి వారం పని దినాల్లో శాశ్వత కమిషన్ హౌదా కల్పించాలని ఆదేశించింది. అంతేగాక, మిగతా 25 మంది శాశ్వత కమిషన్‌ను ఎందుకు అనర్హులో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది.
ఆ కమిషన్ల ఖాళీల భర్తీలో జాప్యంపై 'సుప్రీం' సీరియస్
రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలు భర్తీలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ట్రిబ్యునళ్ల నియామకం ఇష్టంలేకపోతే చట్టాన్ని రద్దుచేయాలంటూ జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేషన్‌తో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ అధికార పరిధిని దాటి ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నామన్న న్యాయమూర్తులు.. ఈ విషయాన్ని తాము చెప్పాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఇది సంతోషించదగిన పరిణామం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పనపై సుమోటో కేసుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. 8 వారాల్లోగా ఖాళీలు భర్తీ చేయాలని ఆగస్టు 11న ఉత్తర్వులు జారీచేసింది.