Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ సీఎం, డీజీపీలకు బాబు ప్రశ్న
- అధికారంలోకి వస్తే వదిలిపెట్టనని హెచ్చరిక
- ముగిసిన 36 గంటల దీక్ష
అమరావతి: 'ప్రజల కోసం పనిచేయాల్సిన మీరు రాజకీయ పార్టీలపై ఉగ్రదాడి చేస్తున్నారు. మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలందరూ భయపడాలా?' అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీల నుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా బాబు చేపట్టిన 36 గంటల దీక్ష శుక్రవారం రాత్రి ముగిసింది. టీడీపీ మహిళ కార్యకర్తలు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన కార్యకర్తలనుద్దేశంచి ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయిలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తూ నోరుముయించే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వాటికి టీడీపీ భయపడదని అన్నారు. 'దాడి చేసిన వారిని వదిలిపెట్టను. డీజీపీ, జగన్ ఎవరు కాపాడాతారో చూస్తా. అధికారంలోకి రాగానే కమిషన్ వేసి చట్టప్రకారం శిక్షిస్తా.' అని అన్నారు డ్రగ్స్ నివారణకోసం ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష చేయరని ప్రశ్నించారు. లేని దానిని సృష్టించి తల్లిని, చెల్లిని జగన్ వివాదంలో తీసుకొచ్చారని అన్నారు. సిఎంతో పాటు మంత్రులందరూ తనను తిడుతున్నారని, ప్రతిపక్ష నాయకుడిది కూడా రాజ్యాంగ పదవేనని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్రం నాశనమవుతుందనే కారణంతోనే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి లేఖ రాశానని వెల్లడించారు. జగన్ ఇచ్చిన తప్పుడు హామీలకు ఆశపడి అందరూ అతనికే ఓట్లు వేశారని తెలిపారు. అప్పుడు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని వ్యాఖ్యానించారు. కరెంట్ చార్జీలు తగ్గించలేదని, సిపిఎస్ రద్దు చేయలేని, పోలవరం పూర్తిచేయలేదని ఎద్దేవా చేశారు. అందరినీ సమానంగా చూస్తున్నామంటునే టీడీపీ వారికి పథకాలను ఆపేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై సిబిఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.