Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది నెలల్లో రూ.6.7 లక్షల కోట్ల ద్వైపాక్షిక క్రయ, విక్రయాలు
- సరిహద్దులో ఉద్రిక్తతలున్నా.. ఆగని ఎగుమతులు, దిగుమతులు
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మాత్రం భేషుగ్గా ఉన్నాయని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లే అన్నారు. ఇరుదేశాల వర్తకవాణిజ్యం మును పెన్నడూ లేనంతగా 90బిలియన్ డాలర్ల(సుమారుగా రూ.6.7లక్షల కోట్లు)కు చేరుకుందని తెలిపారు. మరో మూడు నెలల్లో ఇది మరింత
పెరుగుతుందని ఆయన అంచనావేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''గత ఏడాది ఇరుదేశాల మధ్య వర్తకవాణిజ్యం విలువ 88 బిలియన్ డాలర్లు(సుమారుగా రూ.6.6లక్షల కోట్లు)గా ఉంది. ఈ ఏడాది 9 నెలల్లోనే 90 బిలియన్ డాలర్లు దాటింది. గత ఏడాదితో పోల్చితే ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుదల 49శాతం ఉంది'' అని ష్రింగ్లే అన్నారు. ఇరుదేశాల వాణిజ్యం ఈ ఏడాది చివరినాటికి రికార్డ్‌స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. వ్యవసాయం, ఔషధాలు, ఐటీ రంగాలకు చెందిన ఉత్పత్తులు ప్రధానంగా చైనాకు ఎగుమతి అవుతున్నాయని, కోవిడ్-19 సంక్షోభం, లడఖ్, సరిహద్దులో వివాదాలు ఇరు దేశాల వాణిజ్యంలో సమస్యల్ని పరిష్కరించడానికి అడ్డుగా నిలిచాయని అన్నారు. సరిహద్దులో నెలకొన్న ఘర్షణ వాతావరణం ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపిందని తెలిపారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి చర్చలతో ముగింపు లభిస్తుందన్న ఆశాభావముందని, ఇరు దేశాలకు ఉన్న ప్రయోజనాలు, ఆకాంక్షలు, సున్నితత్వం అర్థం చేసుకొని ఒక సంతృప్తికరమైన పరిష్కారం ఉండాలని చెప్పారు.
బియ్యం సరఫరాలో భారత్ టాప్-1
ఈ ఏడాది ఆగస్టు నాటి లెక్కల ప్రకారం చైనాకు బియ్యం సరఫరా చేసిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ నుంచి తక్కువ గ్రేడ్ బియ్యం పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతోంది. జనవరి-ఆగస్టు మధ్య 7,30,781 టన్నుల బియ్యం భారత్ నుంచి చైనా దిగుమతి చేసుకుందని అమెరికాకు చెందిన ఫారెన్ అగ్రికల్చరల్ సర్వీస్(ఎఫ్ఏఎస్) సంస్థ తెలిపింది. ఈ గణాంకాల ప్రకారం ఆగస్టులో చైనా బియ్యం దిగుమతుల్లో 45శాతం వాటా భారత్‌దే ఉందని తెలిసింది. అలాగే చైనా అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య చైనా మొత్తం బియ్యం దిగుమతుల్లో 23శాతం భారత్ నుంచే ఉంది. ఒక టన్ను తక్కువ రకం బియ్యానికి 345 డాలర్లు(సుమారుగా రూ.25,869) ధర లభించిందని 'ఎఫ్ఏఎస్' గణాంకాలు చెబుతున్నాయి. ఇలా దిగుమతి చేసుకున్న బియ్యాన్ని చైనాలో పశుపోషణ, లిక్కర్ తయారీకి వాడుతున్నారట.