Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పరిధి అంశాలపై కేంద్రం పెత్తనం చేసినా మౌనం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కేసుల భయంతో రాష్ట్రాల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన తమ్మినేని వీరభద్రం శుక్రవారం నాడిక్కడ హరి కిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక శక్తులైనప్పటికీ టీఆర్ఎస్, వైసీపీ అధినేతలిద్దరూ కేసుల భయంతో మౌనంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వ్యవసాయం, వైద్యం, విద్యుత్తు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నా, ఇద్దరు ముఖ్యమంత్రులకు బీజేపీని వ్యతిరేకించే ధైర్యం లేదని చెప్పారు. కేంద్ర కక్షసాధింపు చర్యలు, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని చూసి వారు భయపడుతున్నారని ఆరోపించారు. 2022 ఏప్రిల్లో కన్నూర్ (కేరళ)లో జరగనున్న సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభల్లో చేయాల్సిన తీర్మానాలు, బీజేపీ ఓటమికి చేపట్టాల్సిన ప్రజా పోరాటాలపై కేంద్ర కమిటీలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులు అనుకూల నిర్ణయాలు పెరిగిపోయాయని వివరించారు. విశాఖ ఉక్కు మొదలు రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, ఇతర మౌలిక వసతులన్నింటిని కార్పొరేట్లకు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి టీఆర్ఎస్ ఎంపీలు తొలుత గట్టిగా మాట్లాడి, ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. కేసుల భయంతోనే ప్రాంతీయ పార్టీలు పిరికితనం ప్రదర్శిస్తున్నాయనీ, దాన్ని అధిగమించి బీజేపీ వ్యతిరేక శక్తులను ఎలా కూడగట్టాలనే దానిపై చర్చిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) పోరాడుతున్నదనీ, పోడు భూముల పోరాటంలో కాంగ్రెస్ తమతో కలిసి వచ్చిందని ఆయన తెలిపారు. కలిసి వచ్చే శక్తులను కలుపుకొని పోతామన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయనీ, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, పోడు రైతుల సమస్యలు, రైతు చట్టాలు, వ్యవసాయ సమస్యలపై తాము పోరాడుతున్నామని తమ్మినేని తెలిపారు.