Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రచారార్భాటం.. యూపీ ఎన్నికల కోసమే : రాజకీయ విశ్లేషకులు
- 'పూర్తి' వ్యాక్సిన్‌ను పొందింది 30 శాతం మందే
- పెద్దల్లో 70 కోట్ల మందికి ఇప్పటికీ రెండో డోసు అందలేదు
- దేశంలోని మొత్తం 40 కోట్ల మంది చిన్నారులదీ అదే పరిస్థితి : కేంద్ర గణాంకాలు
న్యూఢిల్లీ: భారత్ ఇటీవలే 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సినేషన్స్ మైల్‌స్టోన్‌ను దాటింది. దీంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఇటు మీడియాలో, అటు సామాజిక మాధ్యమాల్లో 'మోడీ గొప్పతనం' అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే, సంఖ్యాపరంగా మాత్రమే వంద కోట్ల డోసులు అందాయనీ, క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 30 శాతం మందికి మాత్రమే పూర్తిగా (రెండు డోసులు) వ్యాక్సిన్ అందిందని కేంద్రం వెల్లడించిన గణాంకాలను ఉటంకించారు. అయితే, బీజేపీ యూపీ ఎన్నికల కోసం ప్రచారార్భాటం చేస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, దాదాపు 130 కోట్ల మంది భారతీయుల్లో పెద్దల సంఖ్య 94.4 కోట్లు. ఈ ఏడాదిలోగా వారందరికీ వ్యాక్సిన్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, ప్రస్తుత గణాంకాలను చూస్తే అది పూర్తయ్యేలా మాత్రం కనబడటం లేదు. దాదాపు 25 కోట్ల మందికి ఇప్పటి వరకూ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందకపోవడం గమనార్హం. వీరిలో అధికం అణగారిన వర్గాలు, ఆదివాసీ ప్రజలే ఉండటం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చప్పగా సాగుతున్నది. ఈనెల 5 నాటికి యూపీలో 15 శాతం మందికి మాత్రమూ పూర్తి వ్యాక్సిన్ అందింది. బీహార్‌లో ఇది 17 శాతంగా ఉన్నది. ఇక కేరళలో 43 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందడం గమనార్హం. కాగా, కేంద్రం చెప్తున్న వంద కోట్ల డోసుల్లో రెండు డోసులూ ఉన్నాయి. పెద్దల్లో 30 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్టు కేంద్రం చెప్తున్నది. దీని ప్రకారం దాదాపు 70 కోట్ల మందికి ఇంకా రెండు డోసుల వ్యాక్సిన్ అందలేదు. అలాగే, దేశంలో ఉన్న మొత్తం 40 కోట్ల మంది చిన్నారులూ (18 ఏండ్ల లోపు వారు) పూర్తి వ్యాక్సినేషన్‌కు నోచుకోకపోవడం ఆందోళనకరం. అయితే, చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి వ్యూహం లేదా విధానం లేకపోవడం గమనార్హం.
ఇక వంద కోట్ల డోసులను భారత్ 'వేగంగా' సాధించి రెండో స్థానంలో నిలిచిందని మీడియా చెప్తున్నది. అయితే, వాస్తవానికి ప్రపంచంలో వంద కోట్లక పైగా జనాభా ఉన్న దేశాలు చైనా, భారత్ మాత్రమే. కాగా, చైనా ఇప్పటికే వంద కోట్ల డోసుల మైల్‌స్టోన్‌ను దాటి 200 కోట్ల వైపునకు దూసుకెళ్తున్నది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది డిసెంబర్‌కు ముందే వారు ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు.
దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మోడీ ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఈ ఏడాది జనవరిలో కాకుండా గతేడాది చివరలో డ్రైవ్‌ను ప్రారంభిస్తే భారత్ ఈ ' వంద కోట్ల డోసుల మైల్స్టోన్'ను ఇంకాస్త ముందుగానే చేరేది. అలాగే, ఇతర దేశాలకు మోడీ ప్రభుత్వం వ్యాక్సిన్లను ఎగుమతి చేయకుండా దేశ పౌరుల భద్రత మీదే దృష్టిని కొనసాగించి ఉంటే పరిస్థితులు మరింత ఆశాజనకంగా ఉండేవి.
పట్టణ ప్రాంతాల్లోని ఎందరో ప్రజలు వ్యాక్సిన్ డోసులను ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ. 300 నుంచి రూ. 4000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ విధంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఖర్చు చేసినవారి సంఖ్య పెద్దల జనాభాలో 20 శాతం మించి ఉండటం గమనించాల్సిన అంశం. వ్యాక్సిన్ డ్రైవ్ తొలినాళ్లలో రెండు డోసులకు మధ్య గ్యాప్ 28 రోజులగా ఉండేది. అటు తర్వాత దానిని 42 రోజులకు పెంచారు. ప్రస్తుతం అది 84 రోజులుగా ఉన్నది. గ్యాప్‌ను నిర్దేశించే విషయంలో సరైన సంసిద్ధత లేదు. సెకండ్‌వేవ్ సమయంలో లక్షలాది కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్‌ను 28 నుంచి 35 రోజులకు తగ్గిస్తే వ్యాక్సినేషన్‌ను వేగంగా చేయవచ్చు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చిన సమయంలో 28 రోజుల గ్యాప్ ఉన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేశారు. ఇక టీకా వేయించుకోనప్పటికీ చాలా మంది వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు పొందినట్టు గత నెల 22న ఒక వార్త సంస్థ నివేదించింది. గత నెల 17న మోడీ పుట్టిన రోజు సందర్భంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ మార్కును సాధించడంలో భాగంగా వారికి ఈ సర్టిఫికెట్లు అందాయి. కాగా, అంతకు ముందు రోజు వరకు రోజుకు సగటున దాదాపు 70 లక్షల డోసుల వ్యాక్సిన్లు అందేవి. అయితే, ఉన్నట్టుండి ఆ ఒక్క రోజే అది అమాంతంగా 2.5 కోట్ల డోసులకు పెరగడాన్ని ఆరోగ్య నిపుణులు ప్రశ్నించారు. ఇప్పటికీ 70 శాతం మంది పెద్దలు, 100 శాతం మంది చిన్నారులకు పూర్తిగా వ్యాక్సిన్ అందలేదు. ఈ తరుణంలో అక్టోబర్‌లో వ్యాక్సిన్ ఎగుమతులకు భారత్ సిద్ధమైంది. ప్రస్తుత తరుణంలో దేశంలోని ప్రజలకు, ఎగుమతులకు సరిపడా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే స్థానంలో భారత్ లేదనీ, ఇది అతిపెద్ద సవాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయనీ, పండుగల సందర్భంగా సభలు, సమావేశాలు, ప్రజలు గుమిగూడ టాన్ని ప్రభుత్వాలు నిరోధించాలని సూచించారు. కుంభ మేళా, ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దేశంలో విజృంభిం చిన సెకండ్‌వేవ్‌ను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.