Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా పరిస్థితులపై సమీక్ష
శ్రీనగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం జమ్ముకాశ్మీర్ చేరుకున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్‌షా ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అదేవిధంగా ఈనెలలో కాశ్మీర్ లోయలో పలువురు స్థానిక, స్థానికేతర పౌరులు హత్యకు గురైన నేపథ్యంలో హోంమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా అమిత్‌షా తొలిరోజు సోమవారం జమ్ముకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మజోన్ సిన్హాతో పాటు ఆర్మీచ సిఆర్పిఎఫ్, పోలీసులు, ఇతర సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు, చొరబాట్లకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు అమిత్‌షాకు వివరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమ్ముకాశ్మీర్‌లో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. లోయ వ్యాప్తంగా దాదాపు 50 కంపెనీల అదనపు పారామిలటరీ బలగాలను మోహరించినట్లు సమాచారం. శ్రీనగర్‌తో పాటు, కాశ్మీర్‌లోని పలు ఇతర ప్రాంతాల్లో పారామిలటరీ సిఆర్‌పిఎఫ్‌తో కూడిన బంకర్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.