Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారమైనా కొనాల్సిందే
- కొత్త విద్యుత్ రూల్స్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలతో పాటు ప్రజలకు భారంగా మారే విద్యుత్ సవరణలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 11గా నెలలుగా రైతాంగం చేస్తున్న ఆందోళనలను నామమాత్రంగా కూడా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పలు నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా విద్యుత్ రంగంలోనూ అటువంటి నిర్ణయానే తీసుకుంది. రెన్యూవబుల్ ఎనర్జీ (సాంప్రదాయేతర విద్యుత్) యూనిట్ల నుండి తప్పనిసరిగా విద్యుత్‌ను కొనుగోలు చేసి తీరాలని రాష్ట్ర ప్రభుత్వాలను, పంపిణీ సంస్థలను ఆదేశించింది. వీటన్నింటిని మస్ట్రన్ (తప్పనిసరిగా నిర్వహించాల్సిన) యూనిట్ల పేర్కొంటూ కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ చట్టం 2003లో చేసిన సవరణలను శనివారం నోటిఫై చేసింది. ఎలక్ట్రిసిటి (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్స్ డ్యూ టు ఛేంజ్ ఇన్ లా) రూల్స్ 2021, ఎలక్ట్రిసిటి (ప్రమోషన్ ఆఫ్ జనరేషన్ ఫ్రం రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ బై అడ్రసింగ్ మస్ట్ రన్ అండ్ అదర్ మేటర్స్) రూల్స్ 2021లను ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా చేర్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధన కోసం పెట్టుబడిదారులను, ముఖ్యంగా విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించడం గమనార్హం. దీంతో తక్కువ ధరకు లభించే విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని వినియోగించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ధర ఎక్కువైనా కార్పొరేట్లు ఏర్పాటు చేసే విద్యుత్ సంస్థల నుండే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఈ భారం ప్రజలపై పడుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ ఒక్కటి మినహా....
మస్ట్రన్ పవర్ప్లాంటులుగా పరిగణించే రెన్యూవబుల్ ఎనర్జి విద్యుత్ యూనిట్ల ఉత్పత్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపడం కానీ, క్రమబద్దీకరించడంకానీ చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లు సరఫరా ప్రాధాన్యతలు నిర్ణయించే మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ ప్రకారంగానీ, లాభనష్టాలు పరిగణలోకి తీసుకునే ఇతర ఏ వాణిజ్య అంశాల ఆధారంగాకానీ ఈ ప్లాంట్లనుండి ఉత్పత్తిఅయ్యే విద్యుత్‌ను ఆపడం, క్రమబద్దీకరించడంచేయకూడదని ఆదేశించింది. విద్యుత్ గ్రిడ్లలో ఏర్పడే సాంకేతిక, భద్రతా కారణాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈ ప్లాంట్లనుండి విద్యుత్‌ను తీసుకోలేకపోతే నష్టపరిహారం చెల్లించి తీరాలని ఆదేశించింది. అటువంటి అనివార్య సందర్భాల్లోనూ ఎలక్ట్రిసిటి గ్రిడ్ కోడ్ నిబంధనలను పాటించి తీరాలని పేర్కొంది. అదే సమయంలో ఉత్పత్తిదారులకు పవర్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. చట్టంలో వచ్చిన మార్పుల ప్రకారం నెలవారి టారిఫ్‌ను లెక్కవేయడానికి నూతన విధానాన్ని అమలు చేయాలని కేంద్రం తాజా ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అంటే జనం నెత్తిన భారం పడటం ఖాయమన్నమాట.
సరఫరా ప్రణాళిక విభాగాలు రద్దు...
తాజా ఉతర్వులకు మూడు రోజుల ముందు ప్రాంతీయ విద్యుత్ కమిటీ (రీజనల్ పవర్ కమిటీస్)ల సరఫరా ప్రణాళిక (ట్రాన్స్మిషన్ ప్లానింగ్) విభాగాలను కేంద్రం రద్దు చేసింది. ఈ కమిటీలు తమ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి, ధర, డిమాండ్లను బట్టి కొనుగుళ్లను క్రమబద్దీకరిస్తుంటాయి. ఈ తరహా విధానం దేశంలో రెన్యువబుల్ ఎనర్జీ అభివృధ్దికి ఉపయోగపడదని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20 వ తేదిన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తరన్, సదరన్, నార్త్ ఈస్ట్రన్ పవర్ కమిటీల సరఫరా ప్రణాళిక విభాగాలు రద్దు అయ్యాయి. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రణాళికలకు అవకాశమే లేకుండా పోయింది.