Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ హింసలో సిట్ విచారణకు అప్పగింత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌లో రైతులపై జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర సహాయమంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను మరో రెండు రోజులపాటు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎంతోమంది అమాయక రైతుల్ని బలితీసుకున్న ఈ ఘటనలో మిశ్రాతోపాటు అంకిత్ దాస్, శేఖర్ భార్తీ, లతీఫ్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుల్ని తమకు అప్పగించాలని సిట్ పోలీసులు కోర్టును కోరగా, లఖింపూర్ ఖేరీ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ చింతా రామ్ ఆమోదించారు. ఈనెల అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 15 వరకు విధించిన పోలీసు కస్టడీ గడువు ముగియటంతో అతడ్ని లఖింపూర్ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రాను తమకు అప్పగించాలని సిట్ మరోమారు కోర్టును కోరింది. లఖింపూర్ ఘటనపై యూపీ డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతోంది. ఈనేపథ్యంలో విచారణ నిమిత్తం నిందితులను తమకు అప్పగించాలని సిట్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీకి నిందితుల్ని అప్పగించింది. పోలీస్ కస్టడీలో విచారణను చూడటానికి నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు అనుమతి ఇచ్చింది.