Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో ఒక వర్గంపై దాడులు
- ఇండ్లు, షాపులు, ప్రార్థనా మందిరాలు ధ్వంసం
- అందినకాడికి దోచుకున్నారు : బాధితులు
అగర్తల: బీజేపీ పాలిత రాష్ట్రం త్రిపురలో హిందూత్వ సంస్థలు రెచ్చిపోయాయి. అక్కడ ఒక వర్గానికి చెందినవ్యక్తులు, వారి ఇండ్లు, దుకాణాలు, ప్రార్థనా మందిరాలపై దాడులకు దిగాయి. త్రిపురలో ఆ వర్గానికి చెందిన దాదాపు ఆరు ప్రార్థనా మందిరాలను హిందూత్వ శక్తులు ధ్వంసం చేశాయి. అలాగే, తమ ఇండ్లు, దుకాణాలపై దాడులు చేసి అందినకాడికి దోచుకున్నాయని బాధితులు వాపోయారు. బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు ప్రతీకారంగానే హిందూత్వ సంస్థలు ఈ దాడికి దిగినట్టు స్థానిక వార్త సంస్థ తెలిపింది. త్రిపురవ్యాప్తంగా 'ఒక వర్గం'పై జరిగిన ఈ హింసాత్మక దాడుల్లో ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషద్ (వీహెచ్పీ), బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఉన్నాయని తెలిపింది. బంగ్లాదేశ్ ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన సమయంలోనే హిందూత్వ సంస్థలు ఈ దారుణాలకు పాల్పడ్డాయని వివరించింది. నిరసనల్లో భాగంగా 'ఆ వర్గానికి' వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వారు అక్కడ నుంచి పారిపోయేలా బెదిరింపులకు దిగాయి. వారి ఇండ్లల్లోకి వెళ్లిన హిందూత్వ కార్యకర్తలు దొరికినకాడికి దోచుకున్నారు. ఇండ్లల్లో సామాన్లను చిందరవందరగా విసిరేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా, ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు 15 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధించారు.
ఈనెల 19న గోమతి జిల్లా ఉదరుపూర్లో, 22న పనిసాగర్లోని తమ ప్రార్థనా మందిరాలకు ఆగంతకులు నిప్పు పెట్టారని ఒక వ్యక్తి వివరించారు. అలాగే, క్రిష్ణసాగర్, ధర్మానగర్, పనిసాగర్, చంద్రాపూర్ లలోనూ ఇలాంటి దాడుల ఘటనలు నమోదయ్యాయి. ధర్మనగర్లోని తన ఇంటిపై హిందూత్వ సంస్థలు దాడికి దిగి అందినకాడికి దోచుకున్నాయని ఒక లాయర్ తెలిపారు. తన ఇంటి ముందు కాషాయ జెండాలనూ పాతారని వివరించారు. కాగా, ఇలాంటి ఘటనలు ఖండనార్హమనీ, రాష్ట్రంలోని అన్ని మతాలూ శాంతిని పాటించాలని ఇండిజినియస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ చీఫ్ ప్రద్యోత్ మానిక్య ట్వీట్ చేశారు.