Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కార్పొరేట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతుల ఉద్యమం అక్టోబర్ 26 నాటికి, పదకొండు నెలల సుదీర్ఘ శాంతియుత పోరాటాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు ఎస్కేఎం పిలుపునిచ్చింది. పోరాటాన్ని తీవ్రతరం చేయడానికీ, మరింత మంది రైతులను సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎస్కేఎం తెలిపింది. అలాగే, కర్నాటకకు చెందిన సామన్య పౌరుడు నాగరాజ్ కల్కుతగర్ అనే 39 ఏండ్ల యువ టెక్కీ 2021 ఫిబ్రవరి 11న కర్ణాటకలోని ఎంఎం హిల్స్ నుంచి ఢిల్లీ ఆందోళనకు పాదయాత్ర చేపట్టాడు. అతను 4,350 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం 163వ రోజున మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని ఖల్ఘాట్కు చేరుకున్నారు.
షహీద్ కిసాన్ అస్తికలశ యాత్రలు
షహీద్ కిసాన్ అస్తికలశ యాత్రలు కూడా అనేక ప్రదేశాలలో జరుగుతున్నాయి. ఉద్యమానికి మరింత బలాన్ని సమకూర్చడం, రైతు అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా చూసుకోవాలనే సంకల్పంతో ఈ యాత్రలు జరుగుతున్నాయి. షహీద్ కిసాన్ అస్తికలశ యాత్ర శనివారం చెన్నైలో ప్రారంభమైంది. ఇది చెన్నై నుంచి పూన్నమల్లె, కాంచీపురం వెళ్తుంది. నాలుగు రోజుల షెడ్యూల్లో ఈ యాత్ర తమిళనాడులోని దిండివనం, విల్లుపురం, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, విరుదునగర్, శివగంగై, మధురై, తిరుచిరాపల్లి, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం జిల్లాలను కవర్ చేస్తుంది. చితాభస్మాన్ని బేలో అస్తికలను కలుపుతారు. ఒరిస్సాలో కూడా అలాంటి కలశ యాత్ర ప్రారంభమయ్యాయి. హర్యానాలోని ఎల్లెనాబాద్‌లోని 16 గ్రామాల మీదుగా మరో యాత్ర సాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో మరో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర 25న ముగుస్తుంది. యూపీలోని సంత్ కబీర్ నగర్, డియోరియా జిల్లాల్లో కూడా యాత్రలు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రికి రైతుల సెగ
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో రారుగావ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికిగాను రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు రైతుల నిరసన సెగ తాకింది. రైతులు నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తించారు.మరోవైపు హర్యానా లోని ఫతేహాబాద్లో రాతియా రోడ్డులోని తోహానా వద్ద బీజేపీ భాగస్వామ్య జేజేపీ నాయకుడు నిషాన్ సింగ్‌కు వ్యతిరేకంగా రైతులు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు.బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుభాష్ బరాలా,ఎమ్మెల్యే దేవేంద్ర బాబ్లీలకు వ్యతిరేకంగా కూడా రైతులు నినాదాలు హౌరెత్తించారు.
ప్రభుత్వం పునరాలోచించాలి : బిజెపి ఎంపి వరుణ్ గాంధీ
అన్నదాతలు తాము పండించిన పంటలను తామే కాల్చవలసిన పరిస్థితులు వస్తున్నాయనీ, ప్రభుత్వం తన వ్యవసాయ విధానాలపై పునరాలోచించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కొనేవారు లేకపోవడంతో సమోధ్ సింగ్ అనే రైతన్న తాను పండించిన ధాన్యానికి తానే నిప్పు పెట్టినట్టు కనిపిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. రైతన్నల దుస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశారు.