Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేరళ దేవదాయ శాఖ మంత్రి, డిఎస్ఎంఎం జాతీయ అధ్యక్షుడు కె.రాధాకృష్టన్ అభినందన సభ జరిగింది. శనివారం నాడిక్కడ క్యానింగ్ లైన్ 36లో దళిత శోషన్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) ఢిల్లీ కమిటీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. తొలుత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం డిఎస్ఎంఎం నేత నత్తు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ దేశంలో దళితున్ని దేవదాయ శాఖ మంత్రిగా చేయడం అరుదైన ఘట్టమని అన్నారు. గతంలో కూడా కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం దళితులను పూజారుగా నియమించిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బిజెపి పాలనలో దళితులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని అన్నారు. అలాగే దేశంలో దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందులో ప్రధానమైనది భూమి సమస్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్టన్ మాట్లాడుతూ తనకు గొప్ప అవకాశం వచ్చిందని, సామాజిక తరగతుల అభ్యున్నతికి పని చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎంఎం ప్రధాన కార్యదర్శి రామచంద్రడోమ్, డిఎస్ఎంఎం నేతలు బివి రాఘవులు, వి.శ్రీనివాసరావు, సంపత్, ఎఐకెఎస్ ఉపాధ్యక్షుడు అమ్రారామ్, సహాయ కార్యదర్శి విజూకృష్ణన్ ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఐద్వా నేత ఆశాశర్మ తదితరులు పాల్గొన్నారు.