Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడు రాజకీయ విధానంపైనే చర్చ
- మహాసభల్లో ప్రవేశపెట్టబోయే నివేదిక ముసాయిదాపై చర్చిస్తున్నాం
- మీడియాతో బివి రాఘవులు
న్యూఢిల్లీ: ఎన్నికలొచ్చినప్పుడు తమ పార్టీ ఎత్తుగడల గురించి ఆలోచిస్తామనీ, ఇప్పుడు రాజకీయ విధానంపైనే చర్చ జరుగుతుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు స్పష్టం చేశారు. హరికిషన్సింగ్ సూర్జీత్ భవన్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు శనివారం రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా బివి రాఘవులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ అఖిల భారత మహాసభల గురించీ, అందులో ప్రవేశపెట్టబోయే నివేదిక ముసాయిదాపై కేంద్ర కమిటీలో చర్చిస్తున్నామని అని అన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మానిటైజేషన్, దాని ప్రమాదం గురించి చర్చ జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణపై కూడా చర్చిస్తున్నామని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, టీకాలు వేయడంలో విజయం సాధించామనే ప్రచారం ఉండే డొల్లతనం గురించి చర్చించామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మతాన్ని, మత వైషమ్యాలను రెచ్చగొట్టే పద్దతితో బీజేపీ, ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొవడంపై కేంద్ర కమిటీలో సభ్యులంతా చర్చించారు. రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులను దుర్మార్గంగా హత్యచేసిన కేంద్ర మంత్రి, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోకుండా, వారిని కాపాడే పనిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు విపరేతంగా పెరుగుతున్నాయనీ, దీనిపై కూడా కేంద్ర కమిటీలో చర్చించామని అన్నారు. పెట్రో ఉత్పత్తుల పెంపుపై వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయనీ, అయితే దీనిపై ఆందోళన కార్యక్రమం నిర్మించడానికి ఆలోచన చేస్తున్నామని అన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం విలయతాండవం చేస్తుందని, కోవిడ్ తరువాత చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. నిరుద్యోగంపై దేశవ్యాప్త పోరాటంపై కేంద్ర కమిటీ చర్చిస్తున్నదని అన్నారు. రాష్ట్రాల చేతుల్లో ఉండే విద్యుత్ రంగాన్ని కేంద్రం లాక్కొంటుందనీ, మోడీ తన స్నేహితులైన కార్పొరేట్, ప్రయివేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఎన్నికల ఎత్తుగడల గురించి ఆలోచిస్తామని అన్నారు. కేంద్ర కమిటీలో రాజకీయ విధానం గురించి చర్చిస్తున్నామని, అంతేతప్ప ఎన్నికల ఎత్తుగడల గురించి చర్చించటం లేదని స్పష్టం చేశారు.