Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ : హత్యాయత్నం కేసులో ఒక వ్యక్తి పడిన శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో శిక్ష తగ్గించాలని నిందితుడి తరపు న్యాయవాది కోరిన సమయంలో వ్యతిరేకించని ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఇప్పుడు ఇలాంటి పనికిమాలిన అప్పీల్ చేయడం ఏంటని ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ విక్రంనాథ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. సుప్రీంకోర్టులో ఇటువంటి పనికిమాలిన పిటిషన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే.. శిక్షార్హమైన చర్యలు తీసుకోవడంతోపాటు మంజూరుకు బాధ్యులైన అధికారులపై జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా తన క్లైంట్‌పై ఉన్న నేరారోపణలను నిందితుడి తరపున న్యాయవాది సవాల్ చేయలేదని, శిక్షను తగ్గించాలని మాత్రమే కోరాడని ధర్మాసనం తెలిపింది. ఆ సమయంలో కోర్టులో ఉన్న ప్రభుత్వ తరపు న్యాయవాది నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించలేదని పేర్కొంది. ఐపిసి 307, 34 కింద నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడికి విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైకోర్టు గతేడాది అగస్టులో ఇచ్చిన తీర్పులో నాలుగు సంవత్సరాల ఐదు నెలలకు తగ్గించింది.