Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిమ్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఉద్యోగిని చట్టవిరుద్ధంగా సర్వీస్ నుంచి తొలగించడంపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) యాజమాన్యంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు పరిహారం రూపంలో ఆ మాజీ ఉద్యోగికి రూ.50 లక్షలకు పైగా చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. ఆయనకు ప్రతినెల రూ.19,900 చొప్పున పింఛను ఇవ్వాలని పేర్కొంది. రాజ్ సింగ్ 1980వ దశకంలో డ్రైవర్‌గా నియమితులయ్యారు. తనను ఎయిమ్స్ యాజమాన్యం చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించిందని, దీనిపై తాను 1998లో లేబర్ కోర్టును కూడా ఆశ్రయించానని రాజ్‌సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను సర్వీసు నుంచి తొలగించడం అక్రమం, అన్యాయమని లేబర్ కోర్టు పేర్కొందని తెలిపారు. లేబర్ కోర్టు తీర్పును ఎయిమ్స్ వివిధ ఫోరమ్‌ల ముందు సవాల్ చేసింది. ఇందులో భాగంగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 1988 డిసెంబర్ 4 నుంచి, రాజ్‌సింగ్ పదవీ విరమణ పొందాల్సిన తేదీ 2016, అక్టోబర్ 31 వరకు జీతం, ఇతరత్రా సంబంధించి రూ.50,49,070 మేర చెల్లించాలని జస్టిస్ ప్రతిభ ఎం.సింగ్ ఎయిమ్స్‌ను ఆదేశించింది.