Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రగ్స్ తీసుకుంటున్న వారికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో దేశంలో వెలుగుచూస్తున్న డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) వ్యవహారాలు ప్రస్తుతం దేశ భవిష్యత్తుపై అనేక సవాళ్లను విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ రెవెన్యూశాఖకు కీలక సూచన చేసింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న మొత్తంలో వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్న వారినీ, భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుక్నింటూ, రవాణా, వ్యాపారానికి సహకరిస్తున్న వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటుండటంపై సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. ఈ మేరకు చిన్న మొత్తంలో సొంతానికి డ్రగ్స్ తీసుకుంటున్న వారిని నేర రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూశాఖకు పలు సూచనలు చేసింది. చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకునే వారిని నేర రహితంగా మార్చే క్రమంలో వారిని జైళ్లకు పంపే బదులు డీఅడిక్షన్ సెంటర్లకు, పునరావాస కేంద్రాలకు పంపాలని సామాజిక న్యాయమంత్రిత్వశాఖ రెవెన్యూ శాఖను కోరింది. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ చట్టం (ఎన్డీపీఎస్) లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
డ్రగ్స్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ ఈ మేరకు సూచనలు చేయాలని కోరడంతో ఈ అభిప్రాయాలు వెల్లడించింది. చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకునే వారిని సైతం జైళ్లకు పంపడం మొదలుపెడితే దేశంలో పెను మార్పులు తప్పవని హెచ్చరించింది. ఓవైపు డ్రగ్స్ తయారు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు చిన్న మొత్తాల్లో వ్యక్తిగతంగా వాడే వారిని డీఅడిక్షన్ సెంటర్లు, పునరావాస కేంద్రాలకు పంపడం ద్వారా డ్రగ్స్ కల్చర్ కు అడ్డుకట్ట వేయాలని సూచించింది.
వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా.. అవసరమైతే బాధితులుగా పరిగణించి పునరావాసం కల్పించాలని సూచించింది. కాగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న సమయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఇలాంటి సూచనలు చేయడం గమనార్హం.