Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 100 కోట్ల డోసుల పంపిణీ విజయవంతం కావడానికి ప్రధాన కారణం మన ఆరోగ్య కార్యకర్తలేననీ, వారు సరికొత్త ఉదాహరణను అందించారని ప్రధాని మోడీ అన్నారు. మన్‌కీబాత్‌లో తాజాగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుండటంతో ప్రపంచ దేశాల ముందు భారత్ తన శక్తి సామర్థ్యాలు, సత్తాను ప్రదర్శిస్తున్నదని అన్నారు. దేశ ప్రజలందరికీ కరోనా టీకాలు అందించే కార్యక్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదని కొనియాడారు. ''మా ఆరోగ్య కార్యకర్తలు వారి నిర్విరామ కృషి, ధృఢ సంకల్పంతో కొత్త ఉదాహరణను దేశానికి అందించారు. వారి ఆవిష్కరణ.. సంకల్పంతో సేవకు కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చారు'' అని మోడీ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌కు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాల్‌తో ప్రధాని మాట్లాడారు. టీకా సమయంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.కరోనా టీకాల సరఫరా 100 కోట్ల డోసుల విజయం తర్వాత దేశం కొత్త ఉత్సాహంతో.. కొత్త శక్తితో.. ముందుకు సాగుతోందన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని చెప్పారు. సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం చాలా సంతోషకరమైన విషయం అని ప్రధాని మోడీ అన్నారు. 'సర్దార్ వల్లభ్ భారు పటేల్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనకు ఐక్యత సందేశాన్ని అందించారు. మన ఐక్యతతోనే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని సర్దార్ చెప్పేవారు. మనలో ఐక్యత లేకపోతే మనం కొత్త విపత్తుల్లో చిక్కుకున్నట్లే భావించాలి' అని సూచించారు అని మోడీ వెల్లడించారు.
ప్రధాని విదేశీ పర్యటన
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2వరకు రోమ్, ఇటలీ, స్కాట్లాండ్, యూకేల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ 16వ జీ-20 సదస్సులో పాల్గొంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఐక్యరాజ్య సమితి క్లైమెట్ ఛేంజ్ కాన్సరెన్స్ (కాప్-26) సదస్సులోనూ పాల్గొంటారని తెలిపింది.