Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో మతహింసకు ఊతమిస్తున్న సందేశాలు 'వాల్‌స్ట్రీట్ జర్నల్'
నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్ సేవలు పుకార్లకు, మత విద్వేష ప్రచారానికి ఉపయోగపడుతున్నాయని తాజా పరిశోధనలో బయటపడింది. ఫేస్బుక్ అంతర్గత పత్రాల ఆధారంగా పరిశోధకులు రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాల్ని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తాజాగా వార్తా కథనాలుగా ప్రచురించింది. గత ఏడాది ఫిబ్రవరిలో చెలరేగిన ఢిల్లీ అల్లర్లకు, హింసాత్మక ఘటనలకు వాట్సాప్, ఫేస్బుక్ సేవలు కూడా ఒక కారణమయ్యాయని, ఆనాడు అల్లర్లు చెలరేగిన ప్రదేశంలో పెద్ద సంఖ్యలో మత విద్వేషపూరిత సందేశాలు వెలువడ్డాయని, పరిశోధకులు జరిపిన ఇంటర్వ్యూలో అనేకమంది ఈ విషయాన్ని వెల్లడించారని నివేదికలో పేర్కొన్నారు. భారత్‌లో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలకు ఫేస్‌బుక్‌ను వాడుతున్న సంగతి తమకు తెలుసునని ఫేస్బుక్ అధికారవర్గాలు అంగీకరించాయి. హిందూ అతివాద గ్రూపులు పంపే ముస్లిం వ్యతిరేక సందేశాల్ని అడ్డుకోలేకపోతున్నామని 'ఫేస్బుక్ ప్రజావేగు అధికారి ఫ్రాన్సెస్ హాజెన్ చెప్పారు. ఫేస్బుక్ అంతర్గత పత్రాల ఆధారంగా పరిశోధకులు పలు అంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు. వాటినే 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తన వార్తా కథనంలో పేర్కొంది. 'కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా పార్ట్-1' పేరుతో ఉన్న ఫేస్బుక్ అంతర్గత నివేదిక (జులై 2020)లోని వివరాల్ని పరిశోధకులు సేకరించారు. దీంట్లో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసనల గురించి ప్రస్తావించారు. నిరసనల సమయంలో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా..తప్పుడు సమాచారం, పుకార్లు, మత విద్వేష సందేశాలు వెలవడ్డాయి. ఫేస్బుక్ ద్వారా గతంలో కంటే 300శాతం ఎక్కువగా ఇలాంటి సందేశాలు వెలువడ్డాయి. అలాగే ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ విద్వేష సందేశాలు అల్లర్లు చెలరేగడానికి కారణమయ్యాయి. ఇక కరోనా మహమ్మారి భయాలు చుట్టుముట్టినవేళ, వైరస్ వ్యాప్తి చెందడానికి ముస్లింలే కారణమంటూ వాట్సాప్, ఫేస్బుక్ సందేశాలు వెలువడ్డాయి.
''హిందువులంతా ప్రమాదంలో ఉన్నారు. దీనికంతటికీ ముస్లింలే కారణం' అంటూ తరుచూ తనకు సందేశాలు వచ్చాయని ఢిల్లీకి చెందిన ఒక హిందువు పరిశోధకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి విద్వేషపూరిత సందేశాలపై అటు హిందువులు, ఇటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే సందేశాల ప్రసారాన్ని అడ్డుకోకపోతే, భారత్ ఒక ప్రమాదకర దేశంగా నిలుస్తుందని చెప్పారు. రెచ్చగొట్టే సందేశాలు వెలువడకుండా అడ్డుకునే బాధ్యత ఫేస్బుక్దేనని వారు అభిప్రాయపడ్డారు.