Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఆర్పీఎఫ్ జవాన్లే కాల్చి చంపారంటున్న కుటుంబ సభ్యులు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హౌం మంత్రి అమిత్ షా సమీక్ష జరిపి 24 గంటలు కూడా కాకముందే మరో కాశ్మీరీ పౌరుడి హత్య చోటు చేసుకుంది. సోపియాన్ జిల్లాలోని కేంద్ర రిజర్వు పోలీస్ స్థావరానికి సమీపంలో ఆదివారం ఉదయం ఆ యువ కుడు అనుమానాస్పద స్థితిలో కాల్చిచంపబడ్డాడు. మర ణించిన వ్యక్తిని షాహిద్ అహ్మద్ రతేర్గా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. షాహిద్ అనంతనాగ్ జిల్లాలోని అర్వానీ ఏరియాకు చెందిన రోజు వారీ కూలీ కార్మికుడని, యాపిల్ పంట సాగులో సహాయ కారిగా ఉండేందుకు స్థానిక రైతు నియ మించుకున్నాడని తెలిపారు. సిఆర్పిఎఫ్ జవాన్లే షాహిద్‌ను చంపేశారని షాహిద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సోదరుడు జుబైర్ అహ్మద్ ది వైర్‌తో మాట్లాడుతూ ఘటన జరిగిన సమయంలో షాహిద్ స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగివస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్నేహితుల కంటే కొద్దిగా ముందుగా నడుస్తున్న షాహిద్‌ను సిఆర్పి ఎఫ్ జవాన్లు జైనాపోరా సమీపంలో కాల్చిచంపారని చెప్పారు. ఇది పక్కాగా టార్గెట్ హత్య అని పేర్కొంటూ జుబైర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఘటన సమయంలో అక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు జరగలేదని, అమాయకులను చంపుతూ.. ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలని జుబైర్ డిమాండ్ చేశారు. కాగా, షొపియాన్ జిల్లాలోని బందిపోరా ప్రాంతంలో ఉన్న సిఆర్పిఎఫ్ 178వ బెటాలియన్ బృందంపై కొంతమంది గుర్తుతెలియని ఉగ్రవాదులు దాడి చేశారని, ఆ సమయంలో జవాన్ల ఎదురు కాల్పుల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మరణించాడని, తదుపరి వివరాలు తెలియాల్సి ఉందని జమ్ముకాశ్మీర్ పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నెలలో కేంద్ర బలగాల ప్రమేయంతో జరిగిన హత్యల్లో ఇది రెండోది కావడం గమనార్హం.