Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో సంపన్నులకు రాయితీలు
- అంతులేని ఆదాయపన్ను...!
- తగ్గిన కార్పొరేట్ టాక్స్
న్యూఢిల్లీ : సామాన్యుల కన్నా సంపన్నుల పైన పన్నుల మోత ఎక్కువగా ఉంటుందని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. కరోనా కష్టకాలంలో అయితే అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశం కూడా కార్పొరే ట్లపై కొత్త పన్నులు వేసింది. సామాన్యులను ఆదుకోవ డానికి ఇంతకుమించిన మార్గం లేదని సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కానీ, మన దేశంలో దానికి భిన్నం. నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పన్నుల భారమంతా సామాన్యుల పైనే మోపింది. కరోనా కష్టకాలంలోనూ మోడీ ప్రభుత్వ ధోరణీ ఇదే! ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మోతతో సాధారణ ప్రజానీకాన్ని పిప్పి చేసింది. కార్పొరేట్లకు రాయితీల వర్షం కురిపించింది. ఆర్థికశాఖ అధికారికంగా విడుదల చేసిన రికార్డుల ప్రకారం కొన్ని సంవత్సరాలుగా దేశ ఖజానాను పేద, మధ్య తరగతి ప్రజానీకమే నింపుతోంది. వీరి నుంచి పన్నుల రూపంలో వసూళ్లయే మొత్తం సంపన్నవర్గాలు చెల్లించేదానితో పోలిస్తే లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ! విదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే పేరిట కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంతో దేశీయ చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బ తింటు న్నాయి. ఈ పరిశ్రమలకు మాత్రం మోడీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఊతం లభించడం లేదు.
అంతులేని ఆదాయపన్ను...! తగ్గిన కార్పొరేట్ టాక్స్
బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ ఆసక్తిగా చూసేది ఇన్‌కమ్‌ట్యాక్స్ రాయితీల గురంచేనన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు చెల్లించే ఈ ఆదాయ పన్నే దేశ ఖజానాకి ప్రస్తుతం కీలకంగా మారింది. 2014-15లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2.6 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయపన్ను వసూళ్లు ప్రస్తుతం 5.6 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
అంటే 117శాతం పెరుగదల నమోదైంది. కరోనా సమయంలోనూ ఆదాయపన్ను వసూళ్లలో పెద్దగా తగ్గుదల కనిపించలేదు. కార్పొరేట్ పన్ను వసూళ్లు మాత్రం దీనికి భిన్నమైన తీరు. మోడీ అధికారంలో వచ్చిన 2014-15లో 4.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న కార్పొరేట్ టాక్స్ వసూళ్లు ప్రస్తుతం 5.5 లక్షల కోట్లకు చేరింది. ఇది కేవలం 28శాతం పెరుగుదల కావడం గమనార్హం. కార్పొరేట్ టాక్స్‌తో పోలిస్తే ఆదాయ పన్ను 89శాతం అదనంగా వసూలవుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే కరోనా వ్యాప్తికి ముందు 2018-19 సంవత్సరంలో 6.6 లక్షల కోట్ల రూపాయల గరిష్టానికి కార్పొరేట్ పన్ను చేరింది. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చిన రాయితీల కారణంగా పన్నుల వసూళ్లలో కార్పొరేట్ల వాటా గణనీయంగా తగ్గింది. విదేశీ వస్తువులపై విధించే కస్టమ్స్ డ్యూటీదీ ఇదే తీరు. 2014-15లో కస్టమ్స్ డ్యూటీ ద్వారా దేశ ఖజానాకు 1.9 లక్షల కోట్ల రూపాయలు జమ కాగా, ప్రస్తుతం 1.4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వసూలవుతున్నాయి. ఈ డ్యూటీ ద్వారా 2016-17లో అత్యధికంగా 2.3 లక్షల కోట్ల రూపాయలు వసూళ్లయ్యాయి. ఆ తరువాత వివిధ కారణాలు చూపుతూ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఫలితంగా కస్టమ్స్ డ్యూటీ వసూళ్లలో 40శాతం తగ్గుదల నమోదైంది.
రాయితీలే నిజం ... ఉపాధి ఉత్తదే!
కార్పొరేట్ సంస్థలకు రాయితీలిస్తే కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2019లో భారీగా ట్యాక్స్ తగ్గించింది. అప్పటివరకు 30శాతం బేసిక్ రేటుగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను ఆమాంతం 22 శాతానికి కుదించింది.
ఇంకా ఎన్నో ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటి ఫలాలనైతే కార్పొరేట్ యాజమాన్యాలు అనుభవిం చాయి కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం వంటి చర్యలు నామమాత్రంగా కూడా చేపట్ట లేదు. 2020లో కరోనా విజృంభణ తరువాత ఉన్న ఉద్యో గాలనే కుదించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో వివిధ పేర్లతో కార్పొరేట్ సంస్థలకు 6 లక్షల కోట్ల రూపాయల మేర (అందుబాటులో ఉన్న బడ్జెట్ పేపర్ల మేరకు) రాయితీలను ఇచ్చింది. ఫలితంగా దేశంలోని దాదాపు అన్ని లిస్టెడ్ కంపెనీలు 2020 ఆర్థిక సంవత్సరాంతానికి రికార్డు స్థాయిలో లాభాలను పొందాయి. పన్నుల రాయితీలు ప్రోత్సహకాలతో పాటు, పెద్ద ఎత్తున సిబ్బందిపై వేటు వేయడం ద్వారానే ఆ సంస్థలు ఈ లాభాలను ఆర్జించాయ న్నది నిపుణుల అభిప్రాయం.
బడుగులపై భారాలు ఇలా!
సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మోపుతున్న భారాలకు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న తీరే నిదర్శనం. 2014-15లో పెట్రో ఉత్పత్తుల ద్వారా 99,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ఖజానాకు చేరగా 2020-21 నాటికి ఈ మొత్తం 3.73 లక్షల కోట్లకు చేరింది. అంటే ఏడు సంవత్సరాల్లో 277 శాతం పెరుగుదల. పెట్రోలు ధరలు 79శాతం, డీజల్ ధరలు 101శాతం పెరిగాయి.
గత ఏడాది కాలంలోనే వంట గ్యాస్ ధర 300 రూపాయలు పెరిగింది. గ్యాస్ సబ్సిడీని విడుదల చేయడం నుండి కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. చౌక ధరలకు ఆహార ధాన్యల సరఫరాను రకరకాల సాకులు చెబుతూ కుదిస్తోంది. గిడ్డంగుల నిండా ఆహారధాన్యాలు ఉన్నా పేదలకు సరిపడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడటం లేదు.