Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్
న్యూఢిల్లీ : కోవిడ్-19 సంక్షోభం దెబ్బకు ప్రపంచం యావత్తు వణికిపోయింది. ఆయా దేశాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదటపడుతోంది..అని అనుకుంటున్న తరుణంలో బ్రిటన్, రష్యా, అమెరికాలో మళ్లీ కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే ఇదేమీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని, బ్రిటన్ సహా వివిధ దేశాల్లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ చెబుతున్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని 'గ్రీన్ టెంప్లెటాన్ కాలేజ్'లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఆయన పనిచేస్తున్నారు. అలాగే భారత్‌లోని అశోకా వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్‌లో కోవిడ్-19 ఎండెమిక్ దశ(అంతరించే దశ) వచ్చిందని చెప్పలేం కానీ, ఆ దిశగా భారత్ వెళ్తోందని మాత్రం చెప్పగలను..అని ఆయన అన్నారు. ''ప్రమాదకర వేరియెంట్ రానంత వరకూ భయపడాల్సిన అవసరం లేదు'' అని చెప్పారు. ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ''భారత్‌లో న్యూడెల్టా రకం వైరస్ గురించి ఇంకా అధ్యయనం జరగాల్సి వుంది. ఇప్పటివరకూ దీనిపై ఉన్న సమాచారం ప్రకారం అంతగా భయపడాల్సిన పని లేదు. గత 2-3నెలలుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా ప్రమాదకర వేరియెంట్ వ్యాప్తి రాకపోతే సంక్షోభం నుంచి బయటపడినట్టే''నని చెప్పారు.
బ్రిటన్‌లో ఫరవాలేదు..
బ్రిటన్‌లో ప్రతిరోజూ కొత్తగా 40-45వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో అనేకం ఫ్లూ కేసులు కూడా ఉన్నాయి. కోవిడ్ వైరస్-ఫ్లూ వైరస్ మధ్య తేడా క్లినికల్‌గా గుర్తించటం చాలా కష్టం. ఇక్కడ ఏది ఫ్లూ, ఏది కోవిడ్ అన్నది చెప్పటం కుదరటం లేదు. దాంతో వీరంతా హాస్పిటల్స్‌కు వస్తున్నారు. అయితే దీనిని బ్రిటన్ సులభంగానే ఎదుర్కొంటోంది. ఈ కేసుల్లో రోగి పరిస్థితి దిగజారటం, మరణానికి చేరువకావటం చాలా తక్కువగా ఉంది. బ్రిటన్‌లో ప్రస్తుత కేసుల పెరుగుదలకు కొత్త వేరియెంట్స్ కారణమనే అనుమానాలున్నాయి.