Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో దారుణం
- పండ్లు అమ్ముకునే వ్యక్తి హత్య
- కావాలనే చంపారు :
స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అమాయక పౌరులెంతోమంది హత్యకు గురవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సాగుతుండగానే హత్యాకాండ కొనసాగుతోంది. షోపియాన్ జిల్లాలో పండ్లు అమ్ముకునే 20ఏండ్ల పౌరుడు షాహిద్ అహ్మద్ అనే యువకుడు సీఆర్పీఎఫ్ కాల్పుల్లో మరణించాడు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురెదురు కాల్పుల్లో షాహిద్ చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందులో నిజం లేదని, షాహిద్‌ను లక్ష్యంగా చేసుకొనే ఏకే 47 గన్‌తో కాల్చి చంపారని బాధిత కుటుంబ సభ్యులు, షాహిద్ సోదరుడు జుబైర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి.
షాహిద్ హత్య ఘటన షోపియాన్ జిల్లాలో సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌కు అత్యంత సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కాశ్మీర్ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం కాశ్మీర్‌లోనే ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన మొదటిసారిగా రాష్ట్రానికి వచ్చారు. గతకొన్ని వారాలుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఆయన సమీక్ష జరుపుతున్నారు. ఇటీవల అక్కడ జరిగిన ఉగ్రవాద దాడుల్లో 11మంది అమాయక పౌరులు చనిపోయారని సమాచారం. ఈనేపథ్యంలో కాశ్మీర్లో చోటుచేసుకున్న ఘటనలపై దేశం యావత్తు ఆందోళన చెందుతోంది. కేంద్రం ఇప్పటివరకూ అనుసరించిన విధానాలు బెడిసికొట్టాయని మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌కు సమీపంలో కాల్పుల్లో ఒక అమాయక పౌరుడు మరణించాడు. షాహిద్ హత్య రెండోది. వీటిపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులతో క్రాస్ ఫైరింగ్‌లో వీరు చనిపోతున్నారనే పోలీసుల వాదనను వారు తోసిపుచ్చారు. కొంతమందిని టార్గెట్‌గా చేసుకొనే ఈ హత్యలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లోనే షాహిద్ చనిపోయాడని స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
టార్గెట్ చేసి మరీ చంపారు :
షాహిద్ సోదరుడు జుబైర్
తుపాకీ గుళ్లకు షాహిద్ వెంటనే కుప్పకూలాడు. రక్తంతో తడిసిన అతడి శరీరం, చెల్లాచెదురుగా పడిన యాపిల్ పండ్లు..అత్యంత భీతావహంగా కనిపించింది. కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిన పరిణామంతో ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోవటం స్థానికుల్ని తీవ్రంగా కలిచివేసింది. తన సోదరుడు ఇకలేడన్న సంగతి నమ్మలేక పోతున్నానని జుబైర్ రోదిస్తూ చెప్పాడు. అనేకమార్లు షాహిద్‌ను పిలిచాక, అతడి నుంచి మాట లేకపోయేసరికి.. తనను భయం ఆవరించిందని జుబైర్ చెప్పాడు. ఉగ్రవాదులకు, సీఆర్పీఎఫ్కు మధ్య జరిగిన కాల్పుల్లో షాహిద్ చనిపోలేదని, షాహిద్‌ను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకొని చంపారని జుబైర్ ఆరోపిస్తున్నాడు.