Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అసోంలోని టిన్సుకియా జిల్లాలోని బాగ్జాన్ ఆయిల్ ఫీల్డ్ కింద గ్యాస్ ఉత్పత్తి చేసే చమురు బావి వద్ద కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో పేలుడు సంభవించి ప్రమాదం గతేడాది జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు అక్కడి ప్రకృతి వనరులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. బావి నుంచి అనియంత్రిత గ్యాస్ ప్రవాహానికి దారితీసి మంటలు చెలరేగాయి. దానికి సమీపంలో నివాసముంటున్న అనేక కుటుంబాలను సైతం ఖాళీ చేయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ ప్రమాదం కారణంగా తీవ్ర కాలుష్యంతో ప్రభావితమైన రెండు గ్రామాలు పరిహారం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ రెండు గ్రామాలు దిబ్రూ సైఖోవా జాతీయ ఉద్యానవనానికి సమీపంలో ఉన్నాయి. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో బాధితులకు అధికారులు తగిన పరిహారం అందించలేదని పేర్కొన్నారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (వోఐఎల్) నిర్వహిస్తున్న ఈ చమురు బావి వద్ద మే 27న బాగ్జన్ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 9 వేల మందిని ఈ ప్రమాదం కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. తమ ఆర్జీలను రెండు గ్రామాల ప్రజలు అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. టిన్సూకియా అధికారులు గుర్తించిన ఈ రెండు గ్రామాలు రెడ్ జోన్ లోపల ఉన్నాయని వారు పిటిషన్లో తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా అధికమొత్తంలో వెలువడిన హైడ్రోకార్భన్ కారణంగా విపరీతమైన వేడి, కాలుష్యానికి కారణమై అక్కడి సాగును, పంట పొలాలను, జీవజాతులపై తీవ్ర ప్రభావం పడిందని పిటిషన్లో వెల్లడించారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ జోక్యంతో కమిటీ ఏర్పాటు కాగా, బాధితులకు మూడు కేటగిరీలుగా వర్గింకరించి పరిహారం అందించాలని రిపోర్టు సైతం ఇచ్చింది. బాధితులకు న్యాయం దక్కకపోవడంతో సుప్రీంను రెండు గ్రామాలు ఆశ్రయించాయి.