Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులపై సీబీఐ విచారణ జరపండి
- డీజీపీని రీకాల్‌కు కేంద్రాన్ని ఆదేశించండి
- ఏపిలోని డ్రగ్స్ హబ్‌పై విచారణ జరపండి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు చంద్రబాబు బృందం వినతి
న్యూఢిల్లీ : ''ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్ 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలన ప్రకటించాలి. అక్టోబర్ 19న టీడీపీ కార్యాలయాలు, నేతలపైన జరిగిన దాడుల ఘటనలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి. ఏపీలో డ్రగ్ హబ్ నిర్వహణ వంటి క్రిమినల్ నెట్వర్స్క్పై విచారణకు ఆదేశించండి. రాజ్యాంగ విధులను, బాధ్యతలను ఉల్లంఘించి అధికార వైసీపీతో అంతర్గతంగా కుమ్మక్కు అయిన డీజీపీని రీకాల్ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి'' రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం కోరింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులతో కూడిన బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎనిమిది పేజీల వినతి పత్రం అందజేసింది. అలాగే రెండేండ్లలో జగన్ ప్రభుత్వ అరాచకాలు, భయపెట్టిన విధానంపై 323 పేజీల పుస్తకాన్ని కూడా రాష్ట్రపతికి అందించారు. రాష్ట్రపతితో దాదాపు అరగంట సేపు బృందం చర్చించింది. రాష్ట్రపతి కూడా టీడీపీ ఇచ్చిన వినతిపత్రాన్ని చదివారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ''ఏపీలో జరిగే మాఫియా కార్యకలాపాలు, ప్రభుత్వం పేరిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి వివరించాం. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా దానికి చిరునామాగా ఏపీ అనే పరిస్థితి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 25 వేల ఎకరాల్లో రూ.8 వేల కోట్లు విలువ చేసే గంజాయి పెంచుతున్నారు. అదే సమయంలో యూపీ, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఇది ఏపీ నుంచి వచ్చిందని అక్కడ పోలీసులు చెప్పే పరిస్థితి ఏర్పడింది'' అని అన్నారు. ''ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్ల విలువ చేసే 3 వేల కేజీలు హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందని విచారిస్తే, విజయవాడ సత్యనారాయణపురం చిరునామా వచ్చింది. దేశంలోనే కాకుండా డ్రగ్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చారు. నర్సాపురం నుంచి లేస్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తారు. అందులో డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియా పంపించే పరిస్థితి వచ్చింది. దానిని బెంగళూంలో పట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయి ఎక్కడ దొరికినా పోలీసుల విశ్లేషణల్లో ఏపీ పేరు వస్తోంది'' అని పేర్కొన్నారు.
''రాష్ట్రంలో ఈ రెండున్నరేండ్లలో దేశంలో, అంతర్జాతీయంగా ఎక్కడాని లేని మద్యం బ్రాండ్లు వచ్చాయి. ఏపీకి ప్రత్యేకమైన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. తయారీ అంతా ఈయన మనుషులు చేయడం. వీళ్ల మాఫియా చేయడం. స్టేట్ బ్రేవరేజేస్ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ సరఫరా చేయడం. అమ్మే దగ్గర కూడా బిల్లులు ఇవ్వకుండా చేయడం. ఆన్లైన్లో డబ్బులు తీసుకోవడం లేదు. ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. మద్యపాన నిషేదం అన్నారు. దానిపేరుతో మూడు, నాలుగు ధరలు పెంచి సొంత వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది కొనలేని వారు ఆరోగ్యానికి హానికరమని పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. మరోవైపు అక్రమ మద్యం ఎక్కడికక్కడ తయారు చేసుకునే పరిస్థితి. మద్యం ధర ఎక్కువ కావడంతో గంజాయి, హెరాయిన్ తక్కువ రేటుకు వస్తోందని వాటిని కలుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక మాఫియా తయారైంది. ఇటీవల టీడీపీ తరపున మేం వీటన్నింటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలనేది మా ఉద్దేశం. దీని వలన యువత జీవితాలు నాశనం చేసుకుంటారు. ఒకసారి అలవాటైతే వారు దాని నుంచి బయటకు రాలేరు. ఏ నేరాలైనా, ఘోరాలైనా చేస్తారు. చివరకు వాళ్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే యువత పూర్తిగా నిర్వీర్యమవుతుంది. తద్వారా జాతి నిర్వీర్యమవుతుంది. ఇలా వచ్చే డబ్బులన్నీ సంఘ వ్యతిరేక శక్తులకు వెళతాయి. వాళ్లు ఉగ్రవాదులు, రౌడీలు, ముఠా నాయకులు, గ్యాంగ్‌స్టార్స్ కావచ్చు. అందరికీ డబ్బులు వెళతాయి. అలా వెళితే ఇష్టానుసారంగా రాష్ట్రంలో వీళ్లు పెట్రేగిపోయి పని చేసే పరిస్థితి వస్తుంది. దానిని నియంత్రించమని మేం చెప్పాం. వేరే రాష్ట్రాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మనం సిగ్గు పడే పరిస్థితి వస్తుంది'' అని వివరించారు.
''ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అనేక విషయాల్లో నెంబర్ వన్‌గా చెప్పేవారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ విషయాల్లో నెంబర్ వన్ అని చెబుతున్నారు. వీటిపై పోరాడినందుకే తమ పార్టీ కార్యాలయాలపైన, నేతల ఇళ్లపైన వరుస దాడులు చేశారు. నేను డిజిపికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తరు. మా వాళ్లు ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ ఎత్తలేదు. పోలీసులే వచ్చి ఈ దాడులు చేయించి వాళ్లను సురక్షితంగా పంపించే పరిస్థితి నెలకొంది. ఇది చాలా స్పష్టంగా ప్రభుత్వ పేరిత ఉగ్రవాదం తప్ప ఇంకోటి కాదు. వాళ్లకు ఎంత ధైర్యం ఉండాలి. ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి జరగడం ఏపీ చరిత్రలో మొదటిసారి. ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టే పరిస్థితికి వచ్చారు. సీఎం, డీజీపీ ఇద్దరూ కలిసి మా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారా? మీ ఉద్దేశం ఏమిటీ? భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజలను, రాజకీయ నాయకులను భయపెట్టడం'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని విషయాలను రాష్ట్రపతికి వివరించాం. మా విజ్ఞపనలు విన్న రాష్ట్రపతి సానుకూలంగానే స్పందించారు. అవన్నీ చూసిన తరువాత చాలా తీవ్రమైన అంశాలని అన్నారు. తాము పరిశీలించి తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. వీటిపై టిడిపి ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుంది. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం. దోషులను కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది'' అని చంద్రబాబు స్పష్టం చేశారు.