Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు
- మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్
- పలు అంశాలపై చర్చ
న్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ ఈ నెల 22 - 24 మధ్య న్యూఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో సమావేశమైంది. అనంతరం ఈ క్రింది ప్రకటనను విడుదల చేసింది.
ధరల పెరుగుదలపై అఖిల భారత స్థాయిలో నిరసనలు
పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ పెంపులను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వీటివల్ల ప్రజలపై అనూహ్యమైన రీతిలో భారాలు పడుతున్నాయని పేర్కొంది. దీనికి తోడు వంట గ్యాస్ ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది, మొత్తంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుంది. రవాణా వ్యయం పెరిగి ఆహారం, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారి తీస్తోంది.
పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన కేంద్ర ఎక్సైజ్ సుంకాల మొత్తాలను ఉచిత వ్యాక్సినేషన్‌కు, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సామాజిక పథకాల కోసం ఉపయోగిస్తున్నామని కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు అధిక ధరలు చెల్లిస్తుంటే, టీకాలు ఉచితం కాదు. వాటికోసం ప్రజలు తమకు తాము చెల్లిస్తున్నారని అనడం చాలా హాస్యాస్పదం.
వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.35 వేల కోట్లు ఏమయ్యాయి? కేంద్ర ప్రాయోజిత పథకాలకు, సబ్సిడీలకు బడ్జెట్లో ఇప్పటికే రూ.4లక్షల కోట్లు కేటాయించారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇది మోడీ ప్రభుత్వం తన రోజువారీ విపరీత ఖర్చుల కోసం ఆదాయాలను సమకూర్చుకునేందుకు ప్రజలను కొల్లగొట్టడం తప్ప మరొకటి కాదు.
ఈ ధరల పెరుగుదలను నిరసిస్తూ, దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. గ్రామాలు, తాలుకా స్థాయి నుంచి పట్టణాలు, నగరాల వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి.
చారిత్రక రైతాంగ పోరాటం
వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ సుదీర్ఘకాలంగా మన రైతాంగం చేస్తున్న వీరోచిత పోరాటానికి కేంద్ర కమిటీ వందనాలు తెలియజేస్తోంది. స్వతంత్ర భారతావని ఇంతటి సుదీర్ఘమైన, సుస్థిరమైన పోరాటాన్ని ఇదివరకెన్నడూ చూడలేదు. ఈ పోరాటాన్ని దెబ్బతీయడానికి జరిగిన కవ్వింపు చర్యలనన్నిటినీ అధిగమించి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో రైతులు ఆదర్శప్రాయమైన రీతిలో శాంతియుతంగా ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి లఖింపూర్ ఖేరిలో హింసకు తెగబడడం వంటి దిగ్భ్రాంతికరమైన దారుణాలకు బిజెపి ఒడిగట్టినా దాని ఎత్తులు పారలేదు. ఈ దారుణమైన ఉదంతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుని తండ్రి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనను మోడీ తన కేంద్ర మంత్రివర్గం నుండి ఇంతవరకు తొలగించలేదు. ఆయనను తొలగించడానికి తిరస్కరించడాన్ని బట్టి చూస్తుంటే ఈ అనాగరిక చర్యలో మోడీ ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. మంత్రి కుమారుడు, ఇతర నిందితులపై యుపి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడాన్ని సుప్రీం కోర్టు కూడా విమర్శించింది. ఈ విషయంలో న్యాయం త్వరితగతిన జరగాల్సి వుంది.
రైతాంగ పోరాటానికి అన్ని వర్గాల నుండి ముఖ్యంగా సంఘటిత కార్మిక ఉద్యమం, వ్యవసాయ కార్మికుల నుండి వెల్లివిరిసిన సంఘీభావాన్ని చూస్తుంటే మన రైతుల న్యాయమైన డిమాండ్లకు విస్తృతమైన మద్దతు వుందని అర్థ్ధమవుతోంది.
నవంబరు 26తో ఈ రైతాంగ పోరాటానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిన కార్యాచరణ, నిరసనలకు కేంద్ర కమిటీ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. ఈ నిరసన కార్యాచ రణకు క్రియాశీల తోడ్పాటును అందించాల్సిందిగా సిపిఎం తన శాఖలన్నింటికీ పిలుపునిచ్చింది.
జాతీయ ఆస్తుల దోపిడీ
జాతీయ ఆస్తులు, పీఎస్‌యూలను మొత్తంగా ప్రయివేటీకరించేందుకు పెద్దయెత్తున యత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో విస్తారమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు, యంత్రాలను ప్రయివేట్ కార్పొరేట్లకు బదిలీ చేయడమంటే ఒక రకంగా భారత్‌ను అమ్మేయడమే. టాటాలకు ఎయిర్ ఇండియాను ఉచిత బహుమతిగా అందచేయడమే ఇందుకు తాజా ఉదాహరణ. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వీలు కల్పిస్తూ ఇప్పటికే బ్యాంకుల జాతీయీకరణ చట్టానికి సవరణలు తీసుకువచ్చే పనిలో ప్రభుత్వం వుంది.
ఈ విధ్వంసకర చర్యలకు వ్యతిరేకంగా వివిధ రంగాల్లో కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు దేశవ్యాప్త ఉద్యమాలకు పూనుకుంటున్నాయి. కార్మిక వర్గం సాగిస్తున్న ఈ ఐక్య పోరాటాలకు కేంద్ర కమిటీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది.
కుల గణన
2021 జనాభా లెక్కలతోపాటు కుల గణన కూడా నిర్వహించాలన్న పార్టీ డిమాండ్‌ను కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది. ఇటువంటి గణన నిర్వహించడానికి వీలుగా అవసరమైన చర్యలను పార్లమెంట్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చూడాల్సి వుంది.
సీపీఐ(ఎం) 23వ పార్టీ మహాసభ
కేరళలోని కన్నూర్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సీపీఐ(ఎం) 23వ అఖిలభారత మహాసభ ముందుంచే ముసాయిదా రాజకీయ తీర్మానం రూపురేఖలపై కేంద్ర కమిటీ చర్చించింది. దీనికనుగుణంగా పొలిట్ బ్యూరో ముసాయిదాను రూపొందించి కేంద్ర కమిటీ కేంద్ర కమిటీ పరిశీలనకు, అలాగే ఖరారుచేయడం కోసం మహాసభ ముందుంచుతుంది.
జమ్ము కాశ్మీర్
పెద్ద ఎత్తున మిలిటరీ బందోబస్తు, వందలాదిమంది నిర్బంధం మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జమ్ము కాశ్మీర్‌ను సందర్శించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, పూర్వ జమ్మూ కాశ్మీర్‌ను ముక్కలుగా విభజించిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందంటూ ఆయన విపరీత వాదనలు చేస్తున్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల సాగుతున్న హత్యల పరంపర చూస్తుంటే 1990వ దశకంలో నెలకొన్న పరిస్థితిని గుర్తుకుతెస్తోంది. ఇది ఆందోళనకరమైన విషయం. జమ్మూ కాశ్మీర్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రజాతంత్రయుత రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించకుండా అక్కడ పెరుగుతున్న తీవ్రవాద హింసను ఎదుర్కోవడం అంత తేలికయ్యే పని కాదు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే రాజకీయ బందీలందరినీ విడుదల చేయాలని, మీడియాపై ఆంక్షలకు స్వస్తి పలకాలని, విచక్షణారహితంగా ప్రజలను ముఖ్యంగా కాశ్మీరీ యువతను అరెస్టు చేయడాన్ని ఆపాలని కోరుతోంది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ, 35ఎ అధికరణల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సీపీఐ(ఎం)తో సహా పలువురు వేసిన పిటిషన్లను విచారించాల్సిందిగా కేంద్ర కమిటీ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
విద్యుత్ ధరల నియంత్రణ
ప్రధానంగా దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడిన ప్రయివేటు కార్పొరేట్లకు చెందిన విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లు అంతర్జాతీయంగా పెరిగిన బొగ్గు ధరల భారాన్ని వినియోగదారులపై మోపేందుకు విద్యుత్ యూనిట్‌కు అధికంగా ధరను నిర్ణయిస్తున్నాయి. దేశీయంగా బొగ్గుకు ఎలాంటి కొరత లేదు. ప్రయివేటీకరణ, నియంత్రణ ఎత్తివేయడం, ఇంధన రంగాన్ని మోడీ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించలేకపోవడం వంటి వాటివల్లే ఈ సంక్షోభం తలెత్తింది. ఇది, తీవ్ర విద్యుత్ కోతలకు దారితీసింది. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. లేనిపక్షంలో ఇప్పటికే ఎడాపెడా భారాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను మరిన్ని కడగండ్లకు గురిచేయడమే గాక, ఆర్థిక కార్యకలాపాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన నియంత్రణలు, అత్యవసర చర్యలు తీసుకోవాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
కోవిడ్ మహమ్మారి
కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో వైఫల్యాన్ని, టీకాలకు సంబంధించి కొట్లాటలను కప్పిపుచ్చుకునేందుకుగాను మోడీ ప్రభుత్వం ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేలా వంద కోట్ల టీకాల పండగను నిర్వహిస్తోంది. ఆలస్యంగానైనా ఈ రికార్డును సాధించడం అభినందనీయమే, కానీ కేవలం 21శాతం మంది ప్రజలు మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నా రన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులందరికీ పూర్తిగా వ్యాక్సిన్లు అందచేస్తామని ఇచ్చిన హామీని వదిలివేసిన మోడీ ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని ఇప్పుడు జనాభాలో 60శాతానికి కుదించివేసింది. ప్రతి రోజూ కోటిన్నర మందికి వ్యాక్సిన్లు వేయకపోతే ఇది కూడా సాధ్యం కాదు. వ్యాక్సినేషన్ రేటు అంతకంతకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం రోజుకు 40లక్షల డోసులు మాత్రమే వేస్తున్నారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే అంశం. దాదాపు 16వేల కొత్త కేసులు రోజూ తలెత్తుతు న్నాయి. 650మందికి పైగా మరణిస్తున్నారు.
ప్రజలకు మరిన్ని ఇబ్బందులకు గురి చేసేలా మరో ఆరోగ్య విపత్తు తలెత్తకుండా నివారించేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగిరపరచాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.