Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తీరుకు సీటీయూ ఖండన
- ప్రతిఘటించాలని కార్మిక లోకానికి పిలుపు
న్యూఢిల్లీ : దేశ ఆస్తులను, మౌలిక సదుపాయాలను దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వినాశకర ప్రయత్నాలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. చివరకు ప్రజల పింఛను సేవింగ్స్‌ను కూడా కన్నేశారని వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలపై పెద్దయెత్తున జరుగుతున్న ఇటువంటి క్రూరమైన కుతంత్రాలను వ్యతిరేకించాలని, ప్రతిఘటించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడంలో ఎయిరిండియా అమ్మకం ఒక ఉదాహరణ అని సీఐటీయూపేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు బ్యాంకు జాతీయకరణకు సంబంధించిన చట్టాల్లో రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సవరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతుండడం దారుణమని మండిపడింది. ప్రభుత్వ బ్యాంకులు దివాలా ప్రక్రియ ద్వారా ఇప్పటికే కార్పొరేట్లకు ఇచ్చిన వేలాది కోట్ల రుణాలను వదులు కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు పీఎస్‌బీలను అదే అప్పు ఎగవేతదారుల ప్రైవేటు, కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలని చూస్తోందని పేర్కొంది. అదేవిధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ట్రస్టును పిఎఫ్ఆర్డిఎ నియంత్రణ నుంచి తప్పించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని, ఎన్‌పిఎస్‌ను వేరు చేసి దానిని కార్పొరేట్ లేదా కంపెనీస్ చట్టం కింద స్వచ్ఛంద సంస్థగా మార్చేందుకు పిఎఫ్ఆర్డిఎ చట్టం-2013కి సవరణలు తుది దశలో ఉన్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయని తెలిపింది. ప్రయివేట్ ఫండ్ మేనేజర్ల ద్వారా సాగుతున్న ఈ ఊహాగానాలతో తమ నీచమైన ప్రాజెక్ట్ నుండి ప్రజల పెన్షన్ సేవింగ్స్‌ను కూడా వదల్లేదని పేర్కొంది. ఐఎల్ అండ్ ఎఫ్‌సి, ఇతర ప్రయివేట్ ఫండ్ మేనేజర్ల సౌజన్యంతో సాగిన ఊహాగానాల వలన కొంత నియంత్రణలో ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టు కూడా భారీమొత్తంలో కార్మికుల ఈపీఎఫ్ సేవింగ్స్ సొమ్మును కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది.