Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నీట్-పిజి కౌన్సిలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పీజీ ఆలిండియా కోటా సీట్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్ల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు కౌన్సిలింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ సోమవారం జస్టిస్ డివై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల అంశంపై తేలకుండా కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగితే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం నీట్-పీజీ కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) జులై 29న విడుదలైన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది.