Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాషాయపార్టీ వ్యతిరేకశక్తుల ఏకీకరణ జరుగుతున్నది
- ఎన్నికల గురించి కాదు.. రాజకీయ తీర్మానం ముసాయిదాపై చర్చించాం
- ధరల పెరుగుదలపై ఆందోళనలు : మీడియాతో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రజలే నిర్ణయిస్తారనీ, కాషాయ పార్టీ వ్యతిరేకశక్తులన్నీ ఏకీకరణ జరుగుతున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'మేం రాజకీయ తీర్మాన ముసాయిదా గురించి చర్చించాం. ఎన్నికల గురించి కాదు. ఎన్నికలు కూడా రాజకీయమే. కానీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఎన్నికల గురించి చర్చిస్తాం. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే, అక్కడి పరిస్థితుల బట్టీ, రాష్ట్ర కమిటీల అభిప్రాయాలను బట్టీ పొత్తులు ఉంటాయి' అని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా ఆందోళలు చేస్తున్న రైతులకు సహకార ఉత్పత్తి, సహకార మార్కెటింగ్‌తో కూడిన రైతు ఉద్యమం గురించి చర్చిస్తామని అన్నారు. మూడు రోజులపాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల అనంతరం సోమవారం నాడిక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం (ఎకె గోపాలన్ భవన్)లో ఏచూరి మీడియాతో మాట్లాడారు. రైతుల ఉద్యమం గురించి తమ రాజకీయ తీర్మానంలో ఉంటుందనీ, దీనిపై సీపీఐ(ఎం) అన్ని కమిటీలూ చర్చిస్తాయని అన్నారు. అయితే కొన్ని సూచనలు మాత్రమే చేయగలదనీ, అలాంటి ప్రతిపాదనలపై రైతు సంఘాలే నిర్ణయం తీసుకోవాలని ఏచూరి అన్నారు. ''వ్యవసాయంతో సహా దేశంలోని ప్రతిదీ స్వాధీనం చేసుకో వాలనుకునే కార్పొరేట్ నాయకత్వాన్ని ఎదుర్కోలేకపోతే, రైతులు తమ సొంత ఉత్పత్తి సంస్థ ఏర్పాటుకోసం పద్ధతులను కనుగొనవలసి ఉంటుంది. రైతులు స్వచ్ఛందంగా సహకార ఉత్పత్తి, సహకార మార్కెటింగ్‌లోకి ప్రవేశించాలనే ఒక సూచనను మేం చేస్తాం'' అని ఆయన అన్నారు. రైతులు నిరసనలకు అతీతంగా తమ ప్రతిఘటనను విస్తరించే ఆలోచన చేయవలసి ఉంటుందని ఏచూరి తెలిపారు. 'మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నందున వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లడం బీజేపీకి చాలా కష్టంగా ఉంది'' అని ఆయన అన్నారు.
'ధనిక రైతులతో సహా మొత్తం రైతాంగం- పెద్ద కార్పొరేట్ పెట్టుబడి', 'ఎంఎస్ఎంఏఈలు-భారీ పెట్టుబడి', 'కేంద్రం-రాష్ట్రాలు' మధ్య మూడు కొత్త వర్గ వైరుధ్యాలు ఉద్భవించాయని ఏచూరి అన్నారు. ఈ వైరుధ్యాలను రాజకీయ తీర్మానంలో సవివరంగా తెలియజేస్తామన్నారు. స్వాతంత్య్రానంతరం బడా బూర్జువా వర్గానికి, ధనిక రైతులతో సహా మొత్తం రైతాంగానికి మధ్య వివాదం తలెత్తడం ఇదే తొలిసారి. ఈ వైరుధ్యం ఇప్పటికే కదలికలో ఉంది. ఇది రాజకీయ మలుపు తిరుగుతోంది. ఇది ఆకస్మిక విస్ఫోటనాలకు దారి తీస్తుంది. ఇది రాజకీయ సంకీర్ణాలకూ దారి తీస్తుంది'' అని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి దూరమవుతున్నాయన్నారు. సీబీఐ, ఈడీ వంటి వాటిని ఉపయోగించి కాషాయ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ తటస్థంగా ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్కేఎం భారత బంద్‌కు మద్దతు ఇచ్చాయని అన్నారు.
బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది ప్రజలే నిర్ణయించుకుంటారని, ప్రజలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఏచూరి అన్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీపై పోరాటానికి ప్రత్యామ్నాయంగా జనతా పార్టీని ఏర్పరచినట్టే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని నిర్ణయిస్తారని చెప్పారు. ఆ తరువాత 1996లోనూ, 2004లోనూ అటల్ బిహారీ వాజపేయిని ఓడించారని గుర్తుచేశారు. ధరల పెరుగుదలపై ఆందోళనలు ఎప్పుడు జరుగుతాయన్న ఓ విలేకరి ప్రశ్నకు.. ''ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. మేము పిలుపు ఇచ్చిన వెంటనే మా కార్యకర్తలకు సందేశాలు వెళ్తాయి. వారు స్థానిక స్థాయి ఆందోళనలు ప్రారంభిస్తారు. వారి వారి ప్రాంతాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా కలిసొచ్చే పార్టీలను కలుపుకుంటారు. అనేక ఇతర రాజకీయ పార్టీలు ఇలాంటి పిలుపులు ఇచ్చాయి. ధరల పెరుగుదలపై నిరసనలపై భిన్నాభిప్రాయాలు ఉండవు'' అని ఏచూరి తెలిపారు.
జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370, 35 (ఎ) రద్దు రాజ్యాంగ విరుద్ధమని తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని అన్నారు. దీనిపై త్వరగా విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరారు. ఎన్నికల బాండ్లతో రాజకీయ అవినీతి చట్టబద్ధం అవుతుందని ఏచూరి పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లను సవాల్ చేస్తూ తాను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, అది కూడా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఎన్నికల బాండ్ల వల్ల బీజేపీ లాభ పడిందనీ, దాంతో ఎన్నికల్లో డబ్బు కుమ్మరిస్తుందని విమర్శించారు. ఎన్నికల బాండ్లు అనేవి ప్రజాస్వామ్య వ్యతిరేకమని స్పష్టం చేశారు.