Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని, హౌం మంత్రి అపాయింట్మెంట్లు నిరాకరణ
- ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల కేంద్రం నిర్లక్ష్యం : చంద్రబాబు
న్యూఢిల్లీ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబునాయుడు బృందానికి ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు నిరాకరించారు. వివిధ సందర్భాల్లో చిన్నా చితక నేతలు, ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇచ్చిన ప్రధాని మోడీ, హౌం మంత్రి అమిత్ షా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు అపాయింట్మెంట్ నిరాకరించడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇది ముమ్మాటికీ మాజీ ముఖ్యమంత్రి పట్ల కేంద్రం నిర్లక్ష్యమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షనేతకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ పార్టీల నాయకుల పట్ల మోడీ, అమిత్ షా నిర్లక్ష్యం స్పష్టమవుతుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గురించి డిమాండ్ చేసింది. దాడులపై సీబీఐ విచారణ, డీజీపీ రీకాల్, డ్రగ్స్ మాఫియాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని, హౌం మంత్రి అపాయింట్మెంట్ కూడా నిరాకరించారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరితే, మీరు హౌం మంత్రిని కలవండని, హౌం మంత్రికి వివరించమనే స్పందన పీఎంఓ నుంచి వచ్చింది. అయితే హౌం మంత్రి అమిత్ షా మాత్రం జమ్ముకాశ్మీర్ నుంచి ఢిల్లీ చేరుకున్నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి మండలి సమావేశం ఉన్నదని హౌం మంత్రి అపాయింట్మెంట్ నిరాకరించినట్లు సమాచారం.అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి విమానంలో బయలుదేరారు. అంతకుముందు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. ''రాష్ట్రంలోని జరుగుతున్న అంశాలపై కేంద్రానికి తెలపడం ప్రతిపక్షంగా మా బాధ్యత. అందుకే ఇక్కడికి వచ్చాం. రాష్ట్రపతిని కలిశాం. అన్ని అంశాలు వివరించాం. అలాగే ఈ అంశాలపై పోరాడటం కూడా మా బాధ్యత'' అని పేర్కొన్నారు. ''రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగింది. సోమవారం తమిళనాడులో కూడా డ్రగ్స్ పట్టుకున్నారు. అది కూడా ఏపీ నుంచే వచ్చిందనే తేలింది. డ్రగ్స్ దేశ సమగ్రతకు ముప్పు. అది నా ఒక్కడి సమస్య కాదు. అందరూ ముందుకు రావాలి. పిల్లలు ఒక్కసారి డ్రగ్స్‌కు బానిస అయితే, వారి జీవితం అక్కడితో ముగిసిపోతుంది. కనుక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారు కూడా ఆలోచన చేయాలి'' అని పేర్కొన్నారు.