Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 30న 17 మందిపై అభియోగాలు
- కర్నాటక ప్రత్యేక న్యాయస్థానం
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త, సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులైన 18 మందిలో 17 మందిపై అభియోగాలు మోపడానికి అక్టోబర్ 30ను తేదీగా నిర్ణయించినట్టు కర్నాటక కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (కేసీవోసీఏ) ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. కాగా, గౌరీ లంకేశ్ 2017లో తన ఇంటి దగ్గర తుపాకితో కాల్చ చంపబడ్డారు. అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సిట్ ఇప్పటివరకు 18 మందిని అదుపులోకి తీసుకుంది. ఇక తాజాగా న్యాయస్థానం వారిలో 17 మందిపై అభియోగాలు మోపడానికి తేదీని ఖరారు చేయడంతో ట్రయల్ ప్రారంభించడానికి చివరికి అడ్డంకులు తొలగినట్టుగా తెలుస్తోంది. నిందితుడైన మోహన్ నాయక్‌పై సుప్రీంకోర్టు కేసీవోసీఏ కింద అభియోగాలను పునరుద్ధరించిన తర్వాత కేసీవోసీఏ ప్రత్యేక కోర్టు వారిపై అభియోగాలు మోపడానికి సిద్ధమైంది. అంతకు ముందు కర్నాటక హైకోర్టు ఈ ఆరోపణలను విరమించుకుంది కానీ కానీ గతవారం హైకోర్టు ప్రధాన, స్పష్టమైన వాస్తవాలను కప్పిపుచ్చిందనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గౌరీ సోదరి, చిత్ర నిర్మాత కవితా లంకేష్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సహాయంతో సుప్రీంకోర్టు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేసిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటన బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చింది. అదేరోజు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. గౌరీ లంకేశ్ సోదరీ కవితా లంకేశ్ ఈ కేసులో మొదటి ఇన్ఫార్మర్గా ఉన్నారు. ఈ ఘటనపై ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రకారం.. గౌరీ లంకేశ్ హత్యకు ఒక ఏడాది ముందే ప్రణాళిక రచించారు. ఈ కేసులో రెండు చార్జిషీట్లు దాఖలు కాగా, మొదటిది 2018 మే30న హిందూ యువసేన సభ్యుడు కెటి.నవీన్ కుమార్‌పై దాఖలు చేయబడింది. అదే ఏడాది నవంబర్ 23న 9,235 పేజీలతో కూడిన అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఇందులో 18 మంది పేర్లు ఉండగా, వీరిలో షూటర్ పరశురామ్ వాగ్మారే, సూత్రధారులు అమోల్ కాలే, సుజిత్ కుమార్ అలియాస్ ప్రవీణ్ కుమార్, అమిత్ దిగ్వేకర్లు ఉన్నారు. ఇక రెండో చార్జిషీట్ ముఖ్యమైందని చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి సనాతన్ సంస్థ పేరును ప్రస్తావించడమే కాకుండా.. ఈ సంస్థచే హిందూ వ్యతిరేకులుగా భావించబడే 26 మంది హేతువాదులు, ప్రముఖ పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు టార్గెట్‌గా ఉన్నట్టు పేర్కొంది. వారిలో సిద్ధార్థ్ వరదరాజన్ (దివైర్ ఎడిటర్), జర్నలిస్టు అంతరాదేవ్ సేన్, జేఎన్‌యూ ప్రొఫెసర్ చమన్‌లాల్, పంజాబీ రచయిత అతమ్జిత్ సింగ్ తదితరులు ఉన్నారు. గౌరీలంకేశ్ హత్యకేసులోని ముగ్గురు నిందితులు సామాజిక కార్యకర్త, హేతువాది నరేంధ్ర దబోల్కర్ హత్య కుట్రతోనూ సంబంధం కలిగివున్నారు. సీబీఐ ప్రకారం ఈ రెండు నేరాలకు ఒకే ఆయుధాన్ని ఉపయోగించారు.