Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టు
ముంబయి: ఎల్గర్ పరిషత్ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న నిందితుడు, విప్లవ రచయితల సంఘం నేత, రచయిత వరవరరావు నవంబర్ 18 వరకు తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు మంగళవారం పేర్కొంది. అలాగే, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చేనెలకు వాయిదా వేసింది. 82 ఏండ్ల వరవరరావుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న వైద్యపరమైన కారణాలతో ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. సెప్టెంబర్5న తిరిగి పోలీసుల ముందు లొంగిపోయి.. జ్యుడిషియల్ కస్టడీలోకి రావాల్సివుంది. అయితే, బెయిల్ వ్యవధిని పొడిగించాలని కోరుతూ రావు న్యాయవాది ఆర్.సత్యనారాయణన్, సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై ఉన్న సమయంలో తన స్వస్థలమైన హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే, వరవరరావు విజ్ఞప్తులను ఎన్ఐఏ వ్యతిరేకించింది. న్యాయమూర్తులు జస్టిస్ నితిన్ జామ్దార్, ఎస్వీ కొత్వాల్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. వరవరరావు స్వస్థలానికి వెళ్లడానికి సంబంధించి ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం వరవరరావు తన భార్యతో కలిసి ముంబయిలో అద్దెకు ఉంటున్నారు.