Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి అబద్ధాలను బహిర్గతం చేయాలి
- పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత ముఖ్యం
- రాష్ట్ర స్థాయి నేతల్లో స్పష్టత, సమన్వయం లోపం
- రాజ్యాంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం
- పీసీసీ అధ్యక్షుల సమావేశంలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ : బీజేపీ రాజకీయ గురువు ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా సైద్ధాంతికంగా పోరాడాలనీ, ప్రజల ముందు వారి అబద్ధాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నేతలకు సూచించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్లు, పీసీసీ అధ్యక్షుల సమావేశం మంగళవారం నాడిక్కడ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కె.సి వేణుగోపాల్, అజరు మాకెన్, ఉమెన్ చాందీ, మానికం ఠాగూర్, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, తెలంగాణ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ''కొన్ని రోజుల క్రితమే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. మీ అందరికీ తెలుసు. సీడబ్ల్యూసీ ఆమోదించిన మూడు తీర్మానాలను మీరు చదివారు. అవి మీ రాష్ట్రాల్లో పంపిణీ జరిగిందని నేను అనుకుంటున్నాను. పార్టీ పూర్తిస్థాయి సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్ ఇప్పటికే మీ వద్ద ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2021 నవంబర్ 1 ప్రారంభమవుతుంది. 2021 మార్చి 31 వరకు కొనసాగుతుంది'' అని తెలిపారు.''ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త సభ్యులే ప్రాణమని పీసీసీ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, ఇన్చార్జిలకు ప్రతి ఒక్కరికీ నేను ఈ సందర్భంగా నొక్కి చెబుతున్నాను. దేశవ్యాప్తంగా యువతీ యువకులు తమ ఆకాంక్షల కోసం గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. తరతరాలుగా మనం చేసినట్లే వారికి వేదిక కల్పించడం మన బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించే పోరాటం, అసత్య ప్రచారాలను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండటం అవసరం'' అన్నారు.''బీజేపీ, ఆర్ఎస్ఎస్ల దుష్ప్రచారానికి వ్యతిరేకంగా సైద్ధాంతికంగా పోరాడాలి. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మరింత పట్టుదలతో ఉండాలి. ప్రజల ముందు వారి అబద్ధాలను బహిర్గతం చేయాలి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐసీసీ దాదాపు ప్రతిరోజూ ముఖ్యమైన, వివరణాత్మక ప్రకటనలను విడుదల చేస్తుంది. కోర్ కాంగ్రెస్ భావజాలాన్ని సమర్థిస్తూ ప్రొజెక్ట్ చేస్తూ బిజెపి, ఆర్ఎస్ఎస్తో పోరాడటానికి మీరు ప్రజలకు శిక్షణ ఇవ్వాలి'' సూచించారు.
''అన్యాయానికి, అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించాలంటే, అట్టడుగు వర్గాల హక్కులను సమర్ధవంతంగా కాపాడుకోవాలంటే, అది అట్టడుగు వర్గాల వరకూ విస్తత ఆందోళనగా మారక తప్పదు. అందుకు మన చరిత్రే సాక్ష్యం. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు పూనుకుంది. మన రాజ్యాంగంలోని ప్రధాన విలువలను అణగదొక్కాలని చూస్తున్నది. ప్రజాస్వామ్య మౌలికాంశాలు ప్రశ్నార్థకంగా మారాయి'' అని అన్నారు. ''రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగాలు, అవకాశాల కోసం పోరాడుతున్న యువత, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, అణగారిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. మోడీ ప్రభుత్వం మితిమీరిన చర్యలతో ప్రభావమైన బాధితుల కోసం మన పోరాటాన్ని రెట్టింపు చేయాలి'' అని పేర్కొన్నారు.