Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా రైతన్నల ఆందోళనలు
- రాష్ట్రపతితో సహా కలెక్టర్లకు వినతులు
- ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మలు దహనం
- చారిత్రాత్మక అన్నదాతల ఉద్యమం 11 నెలలు పూర్తి
న్యూఢిల్లీ : దేశవ్యాప్త ఆందోళనలతో రైతాంగం హోరెత్తించింది. ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలతో అన్నదాతలు ఆందోళనను ఉధృతంచేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు, మెజిస్ట్రేట్లకు, తహశిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, ఎంఎస్పీ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది అన్నదాతలతో జరుగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమం మంగళవారానికి 11 నెలలు పూర్తి చేసుకుంది. అందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళన పిలుపు విజయవంతం అయింది. రైతుల జీవన్మరణ, వారి భవిష్యత్ తరాలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను మోడీ ప్రభుత్వం అంగీకరించకపోవడమే కాకుండా, నిరసన చేస్తున్న రైతులపై దాడి చేయడం ప్రారంభించిందని ఎస్కేఎం పేర్కొంది. ప్రభుత్వ అప్రజాస్వామిక దాడితో రైతు ఉద్యమం మరింత బలోపేతం అయిందని పేర్కొంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు రైతులు ఇండ్లకు వెళ్లబోరని ఎస్కేఎం పునరుద్ఘాటించింది.
లఖింపూర్ ఖేరీ మారణకాండ సూత్రధారి కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా తేనిని తక్షణమే అరెస్టు చేయాలనీ, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. నిరసన మార్చ్‌లు, మోటార్ సైకిల్ ర్యాలీలు, నిరహార దీక్షలు సహా వివిధ రూపాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులు మీరట్ కలెక్టరేట్‌లోకి ట్రాక్టర్లతో చొచ్చుకుపోయారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఘాజీపూర్ సరిహద్దులో బహిరంగసభ నిర్వహించారు. భారీ అకాల వర్షాల కారణంగా పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లినప్పటికీ, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సభలో రైతు నేత రాకేష్ టికాయిత్, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, బీకేయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్వీర్ సింగ్ జాదాన్, ఏఐకేఎస్ యూపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రపాల్ సింగ్ ఇతర నాయకులు ప్రసంగించారు. కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించి అరెస్టు చేయాలని అందరూ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ఓటమికి తమ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.యూపీలోని బాగ్పత్ జిల్లా బరౌత్ సమీపంలోని పుసార్ గ్రామంలో బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్‌కు వ్యతిరేకంగా రైతులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హర్యానాలోని సిర్సా, మల్లేకన్ గ్రామంలో హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్, వ్యవసాయ మంత్రి జెపి దలాల్ పర్యటనకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతలు తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. హర్యానాలోని రేవారీ జిల్లాలో ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్ యాదవ్ నివాసం ముందు రైతులు సజ్జల బస్తాలను పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఎంఎస్పీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ ఉందన్న వాదనలు అవాస్తవమనీ, అది నిజమైతే ఎమ్మెల్యే రైతుల సజ్జలను ఎంఎస్పీకి కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులు సూచించారు. ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యే లక్ష్మణ్‌సింగ్ యాదవ్ రైతులకు నచ్చజెప్పారు.