Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటంలో వేలాది మంది రైతులు
- సాక్షుల భద్రతపై ఎలాంటిచర్యలు తీసుకుంటున్నారు?
- ఎంత మంది సాక్షుల వాంగూల్మం నమోదు చేశారు?
- యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- జర్నలిస్టు హత్యపై స్టేటస్ రిపోర్టు ఇవ్వండి
- నవంబరు 8ని విచారణ వాయిదా
న్యూఢిల్లీ : వేలాది మంది రైతుల పోరాటంలో సాక్షులు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ ఘటనలో జర్నలిస్టు హత్యపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని స్పష్టం చేసింది. లఖింపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు న్యాయవాదులు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. తొలుత యూపీ ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రషాద్ వాదనలు వినిపిస్తూ తాము స్టేటస్ రిపోర్టును అందరికీ అందజేశామని అన్నారు. దీనికి జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ఒక్కరు మినహా మిగతా అందరినీ ఇంకా పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. అందుకు గరిమా ప్రషాద్ సమాధానం ఇస్తూ స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నామనీ, కొన్ని స్టేట్మెంట్లు ఇంకా నమోదు చేయాల్సి ఉందని అన్నారు. స్టేటస్ రిపోర్టు దాఖలు చేసిన తరువాతా సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మరో ఏడు స్టేట్మెంట్లు నమోదు చేశామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. హరీష్ సాల్వే స్టేటస్ రిపోర్టులో గణాంకాలు కొన్ని నవీకరించాల్సి ఉందన్నారు. అందుకు సీజేఐ ఎన్వి రమణ స్పందిస్తూ.. ముందు రిపోర్టులోని పేరా మూడు చూడండి అని అన్నారు. దీంతో హరీష్ సాల్వే 68 మందిలో 30 మంది సాక్షులను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాగ్మూలం నమోదు చేశామనీ, వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్షులని అన్నారు. వెంటనే జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని వేలాది మంది రైతులు ర్యాలీలో ఉంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులా? అని ప్రశ్నించారు. పత్రికల్లో ప్రకటన ఇచ్చామనీ, ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయగా దాన్ని ల్యాబ్‌కు పంపామని సాల్వే తెలిపారు.
''ఘటన సమయంలో సుమారు 5 వేల మంది ఉన్నారని చెబుతున్నారు.. వారంతా స్థానికులే.. సంఘటన తరువాత వారిలో చాలా మంది విచారణ కోసం ఉద్యమిస్తున్నారు. అలాంటప్పుడు వాహనంలో ఉన్న వారిని గుర్తించడం పెద్ద సమస్య కాదు'' అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కారులో ఉన్న వారిని అక్కడి ప్రజలు చూశారని, అనంతరం కారులో ఉన్నవారు మృతి చెందారని యూపీ ప్రభుత్వ న్యాయవాది సాల్వే తెలిపారు. కేసులో బాధ్యులను గుర్తించడం చాలా ముఖ్యమని సీజేఐ జస్టిస్‌ఎన్‌వి రమణ వ్యాఖ్యానించగా.. మొత్తం 16 మంది నిందితుల్ని గుర్తించామని సాల్వే తెలిపారు. ఘటనలో గాయపడిన వారెవరూ సాక్షులుగా లేరా?.. అయితే సరే.. నివేదిక ప్రక్రియ వేగవంతం చేయాలని ల్యాబ్‌లను ఆదేశిస్తామని సీజేఐ తెలిపారు. కొంతమంది గాయపడిన వారు సాక్షులు అయి ఉండొచ్చని మొత్తంగా 164 మంది జాబితా కోర్టుకు అందిస్తామని సాల్వే తెలిపారు. సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, అందుకు చర్యలు చేపట్టాలని సీజేఐ ఆదేశించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించాలని ధర్మాసనం పేర్కొంది. వాంగ్మూలాల సేకరణ అందుబాటులో ఉన్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని జిల్లా న్యాయమూర్తిని ధర్మాసనం ఆదేశించింది. ఘటనకు సంబంధించి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలపై ఫోరెన్సిక్ ల్యాబ్, నిపుణుల అభిప్రాయాలు అందించాలని సూచించింది. ఘటనలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భర్తను కోల్పోయిన రూబీదేవి తరపున సీనియర్ న్యాయవాది అరుణ్ భరద్వాజ్ వాదనలు వినిపించారు. ''ఆమె తన భర్తను కోల్పోయింది. ఆమె భర్త హత్యకు గురయ్యారు. ఆమెకు న్యాయం కావాలి. హంతకులు స్వేచ్ఛగా తిరుగుతూ ఆమెను బెదిరిస్తున్నారు'' అని అన్నారు. దీనిపై ఏం చేశారని ప్రభుత్వ న్యాయవాది సాల్వేని సిజెఐ ప్రశ్నించారు. సాల్వే స్పందిస్తూ తాను పోలీసులకు సమాచారం ఇస్తానని అన్నారు. జర్నలిస్టు, రూబీ దేవి భర్త హత్యలపై వేర్వేరు కౌంటర్లు దాఖలు చేయాలని సాల్వేను సీజేఐ ఆదేశించారు. అలాగే తమ స్టేట్మెంట్లు రికార్డు చేయాలని రూబీదేవి తరపు న్యాయవాది భరద్వాజ్ ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన సీజఐ.. వారి సాక్ష్యాన్ని కూడా రికార్డ్ చేయండని అన్నారు. దీనికి సాల్వే స్పందిస్తూ రికార్డు చేస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా వేసింది.