Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా ఖండించిన రైతు సంఘాలు
- రైతులను వెంటనే విడుదల చేయాలని ఎస్కేఎం డిమాండ్
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఊచకోత కేసులో అరెస్టయిన బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ దాఖలు చేసిన కౌంటర్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇద్దరు రైతులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకడైన సుమిత్ జైస్వాల్ ముందు రైతులపై దూసుకెళ్లిన థార్ జీప్ నుంచి పారిపోతూ కనిపించాడు. శాంతియుత నిరసనకారులు రాళ్లదాడి చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ, రైతుల ఎఫ్ఐఆర్ దాఖలైన కొన్ని గంటల తరువాత అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మరికొంత మంది రైతులను ఇరికించేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. హత్యకు గురైన జర్నలిస్టు రమణ్ కశ్యప్ మృతికి రైతులపై కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన కుటుంబం కూడా ఆరోపించింది. రైతులను ఇరికించేందుకు దర్యాప్తు బృందం, అజరు మిశ్రా తరపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరు రైతుల అరెస్టులను ఎస్కేఎం ఖండిస్తుంది. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కోసం ఎస్కేఎం తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.
సింఘు సరిహద్దులో ఉద్రిక్తం
బాధితుడు లఖ్బీర్ సింగ్ కుటుంబానికి కేంద్ర, హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు పరిహారం చెల్లించాయి. ఉద్యమంలో మరణాలకు సంబంధించిన సమాచారం, రికార్డులు తమ వద్ద లేవని గతంలో ప్రకటించిన ప్రభుత్వాలు లఖ్ బీర్ సింగ్ విషయంలో పరిహారం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. ఎస్కేఎం గతంలో చెప్పినట్టుగా ఈ కేసులో రైతుల ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చి హింసాత్మకంగా ఇరుక్కోవడానికి లోతైన కుట్ర ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొంది.