Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ తరహాలోనే దేశవ్యాప్త వ్యవసాయ కార్మిక ఉద్యమం:
వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపు.
న్యూఢిల్లీ: దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న హక్కులు, చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు. సదస్సుకు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే పి.గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి, సంస్థానాధీశులకు, జమీందారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, కష్టజీవుల విముక్తి కోసం అనేక ఉద్యమాలు సాగాయని అన్నారు. స్వాతంత్రానంతరం దున్నేవాడికే భూమి దక్కాలని, కష్టానికి తగిన కూలి చెల్లించాలని వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు సాగించాయని అన్నారు. ఆ పోరాటాల ఫలితంగా పేదలకు భూమి, ఇండ్ల స్థలాలు, కనీస వేతన చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉచిత విద్య, వైద్యం లాంటి అనేక చట్టాలు సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక వివిధ రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు సాధించుకున్న హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తూ కష్టజీవుల బ్రతుకులు కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నాయని ఆయన విమర్శించారు.
మోడీ ప్రభుత్వం పేదలకు భూ పంపిణీ చేయకపోగా, పేదల వద్ద ఉన్న భూమిని బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తులకు కారిడార్లు నిర్మిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా 11 మందితో కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది. ఈ సదస్సులో బీహార్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బోలా ప్రసాద్, రామ్నాథ్ మీర్జా తదితరులు పాల్గొన్నారు.