Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ భద్రత కారణం చూపి తప్పించుకోరాదు
- మీడియాపై నిఘా వణుకు పుట్టించే ప్రభావం
- దేశ పౌరులపై విదేశీ సంస్థ గూఢచర్యం
- కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోలేదు
- వ్యక్తిగత గోప్యతపై పరిమితులు రాజ్యాంగ పరీక్షలో నెగ్గాలి
- జాతీయ భద్రతను ఊరకనే ఉపయోగించలేం
- పెగాసస్‌పై అత్యున్నత న్యాయస్థానం 46 పేజీల తీర్పు
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ నిఘా కుంభకోణంపై అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేసింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, నెట్వర్క్, హార్డ్‌వేర్ వంటి అంశాల్లో నిపుణులైన వారితో సహా ముగ్గురు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటుచేసింది. దీని పనితీరును పర్యవేక్షించే ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ నాయకత్వంవహిస్తారు. ఐపీఎస్ (1976 బ్యాచ్) మాజీ అధికారి అలోక్ జోషి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్, ఇంటర్నేషనల్ ఎలక్ట్రో-టెక్నికల్ కమిషన్ జాయింట్ టెక్నికల్ సబ్ కమిటీ చైర్మన్ సందీప్ ఒబెరారులను కమిటీ సభ్యులుగా నియమించింది. అలాగే వారికి సహాయం చేసేందుకు మరో ముగ్గురు సాంకేతిక నిపుణుల కమిటీ వేసింది. ఆ కమిటీలో సభ్యులుగా గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ నవీన్ కుమార్ చౌదరి, కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠం, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పి. ప్రభాహరన్, ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ అశ్విన్ అనిల్ గుమాస్తే ఉన్నారు. పెగాసస్‌పై సమగ్రంగా పరిశీలించి, విచారించి నివేదిక సిద్ధం చేయాలనీ, కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఈ అంశం 8 వారాల తరువాత విచారణ జాబితా చేయస్తామని తీర్పులో పేర్కొంది.పిటిషన్ దాఖలు చేసిన వారిలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ ఎన్ రామ్, జర్నలిస్టులు పరంజోరు గుహా ఠాకుర్తా, రూపేష్ కుమార్ సింగ్, ఇప్సా శతాక్షి, ఎస్ఎన్ఎం అబిది, ప్రేమ్ శంకర్ ఝా, న్యాయవాది ఎంఎంల్ శర్మ, ఏషియా నెట్ వ్యవస్థాపకుడు శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం 46 పేజీల తీర్పు వెలువరించింది.
విచారించాల్సిన, పరిశీలించాల్సిన అంశాలు
పెగాసస్ స్పైవేర్ దేశ పౌరుల ఫోన్లు, ఇతర పరికరాలు నిల్వచేసిన డేటా, సంభాషణలను వినడం, సమాచారాన్ని అడ్డగించడం, ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినా? అటువంటి స్పైవేర్ దాడికి గురైన బాధితులు, ప్రభావిత వ్యక్తుల వివరాలు. 2019లో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి దేశంలోని పౌరుల వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్‌కు సంబంధించిన నివేదికలు ప్రచురించిన తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు? కేంద్ర ప్రభుత్వం ఏదైనా పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసిందా? దేశ పౌరులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఏదైన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించిందా? కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు ఉపయోగించాయా? ఏదైనా దేశీయ సంస్థ, వ్యక్తి స్పైవేర్ ఉపయోగించినట్లయితే, అటువంటి అధికారం ఉందా? సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్లు తీసుకోవాలి. అలాగే కమిటీకి కేంద్రం, అన్ని రాష్ట్రాలు, ఏజెన్సీలు, అధికారులు సౌకర్యాలు అందించాలని ఆదేశించింది.
జాతీయ భద్రతపై..
జాతీయ భద్రత విషయంలో అత్యున్నత న్యాయస్థానం అప్రమత్తంగా ఉండవలసి ఉన్నప్పటికీ, న్యాయ సమీక్షకు వ్యతిరేకంగా ప్రతిదాన్ని నిషేధించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ భద్రత అనేది ప్రస్తావించడం వల్ల న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోని విషయం కాదని పేర్కొంది. ''కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని ఇవ్వకుండా తిరస్కరించడానికి అనుమతించేందుకు జాతీయ భద్రత ఒక కారణంగా ధర్మాసనం అంగీకరించింది. అయితే జాతీయ భద్రత గురించి భయాందోళనలు తలెత్తిన ప్రతిసారీ కేంద్రానికి ఉచిత పాస్ లభిస్తుందని దీని అర్థం కాదు'' అని ధర్మాసనం స్పష్టంచేసింది. అటువంటి సందర్భాల్లో ''కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాదించి, వాస్తవాలను నిరూపించాలి. కోరిన సమాచారం తప్పనిసరిగా రహస్యంగా ఇవ్వాలి. ఎందుకంటే సమాచార బహిర్గతం జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితం చేస్తుంది. కేవలం జాతీయ భద్రతను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావిస్తూ కోర్టును మూగ ప్రేక్షకుడిలా మార్చదని'' అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రతి ఒక్క పౌరుడి గోప్యత ఉల్లంఘనపై..
''మనం ప్రస్తుతం సమాచార విప్లవ యుగంలో జీవిస్తున్నాం. వ్యక్తుల జీవితాలు క్లౌడ్, డిజిటల్ డాసియర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సాంకేతికత ఒక ఉపయోగకరమైన సాధనం. అదే సమయంలో ఇది వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకు కూడా ఉపయోగపడుతున్నది'' అని పేర్కొంది. ''గోప్యత అంశం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు మాత్రమే సంబంధించినది కాదు. గోప్యత ఉల్లంఘనల నుంచి దేశంలోని ప్రతి పౌరుడికీ రక్షణ ఉండాలి. ఇదే వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఎంపికలను ఉయోగించుకునేలా చేస్తుంది'' అని ధర్మాసనం పేర్కొంది.
వ్యక్తిగత గోప్యతపై పరిమితులు రాజ్యాంగ పరీక్షలో నెగ్గాలి
''అన్ని ఇతర హక్కుల మాదిరిగానే గోప్యత హక్కు కూడా సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. అయితే ఏమైన పరిమితులు విధిస్తే, అవి తప్పనిసరిగా రాజ్యాంగ పరీక్షలో నెగ్గాలి'' అని పేర్కొంది. ఉదాహరణకు ప్రస్తుతం ప్రపంచంలో హింస, ఉగ్రవాదంపై పోరాటానికి నిఘా పెట్టి ఇంటెలిజెన్సీ సంస్థలు సేకరించిన సమాచారం చాలా అవసరం. ఈ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఒక వ్యక్తి గోప్యత హక్కులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇది జాతీయ భద్రత, ప్రయోజనాలను పరిరక్షించడానికి పూర్తిగా అవసరమైనప్పుడు, దామాషా ప్రకారం మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది'' అని పేర్కొంది. ''చట్టబద్ధమైన పాలనలో ఉన్న ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం వ్యక్తులపై విచక్షణారహిత గూఢచర్యం అనుమతించబడదు''అని తీర్పు స్పష్టంచేసింది.
మీడియాపై నిఘా వణుకు పుట్టించే ప్రభావం
మీడియాపై నిఘా వెన్నులో వణుకు పుట్టించే ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ''ఒక వ్యక్తి తన హక్కులను వినియోగించుకోవడంపై నిఘా, గూఢచర్యం వల్ల పొంచి ఉన్న ముప్పు ప్రభావాన్ని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటువంటి దృశ్యం స్వీయ నియంత్రణకు దారితీయవచ్చు'' అని పేర్కొన్నారు. ''ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన స్తంభమైన పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఇది ప్రత్యేక ఆందోళన కలిగించే అంశం. వాక్ స్వాతంత్య్రంపై ఇటువంటి వణికించే ప్రభావం... కీలకమైన ప్రజల పబ్లిక్-వాచ్డాగ్ (పత్రిక) పాత్రపై దాడి చేసినట్టు అవుతుంది. దీంతో కచ్చితమైన, నమ్మదగిన సమాచారాన్ని అందించే పత్రికల సామర్థ్యాన్ని అణగదొక్కవచ్చు'' అని తీర్పు పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోలేదు
పెగాసస్ స్పైవేర్ దాడిని మొదటిసారిగా బహిర్గతం చేసినప్పటి నుంచి లేవనెత్తిన ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. అయితే ప్రభుత్వం తన వైఖరి తెలిపేందుకు, గత రెండేండ్లలో తీసుకున్న వివిధ చర్యలకు సంబంధించి కోర్టుకు సహాయం చేసేందుకు సమాచారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వానికి తగినంత అవకాశం ఇవ్వబడిందని ధర్మాసనం పేర్కొంది. ''జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితంచేసే ఏ సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వంపై మేం ఒత్తిడి చేయబోమని చాలా సందర్భాల్లో స్పష్టం చేశాం. అయినప్పటికీ, పదేపదే హామీలు, అవకాశాలు ఇచ్చినప్పటికీ అంతిమంగా కేంద్ర ప్రభుత్వం పరిమిత అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇది వారి వైఖరిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని తేల్చింది. చేతిలో ఉన్న విషయంపై వాస్తవాలకు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు'' అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమయంలో కేవలం జాతీయ భద్రతను కోరడం న్యాయ సమీక్షకు వ్యతిరేకం కాదని కోర్టు పేర్కొంది.
కేంద్రం నిర్దిష్టంగా తిరస్కరించలేదు
పెగాసస్ వినియోగంపై ప్రభుత్వంపై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలను కేంద్రం ప్రత్యేకంగా ఖండించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ''కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పరిమిత అఫిడవిట్లో అన్నింటిని గంపగుత్తగా, అస్పష్టంగా తిరస్కరించింది. ఇది సరిపోదు'' అని కోర్టు పేర్కొంది. అటువంటి పరిస్థితులలో పిటిషనర్లు చేసిన ఆరోపణలను పరిశీలించడానికి ప్రాథమికంగా కేసును అంగీకరించడం మినహా మాకు వేరే మార్గం లేదని కోర్టు స్పష్టం చేసింది.
దేశ పౌరులపై విదేశీ సంస్థ గూఢచర్యం
దేశ పౌరులపై విదేశీ అధికార గూఢచర్యం చేసినందున పిటిషనర్ల వాదనను కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది. ''ఈ దేశంలోని పౌరులను నిఘాలో ఉంచడంలో కొన్ని విదేశీ అధికారం, ఏజెన్సీ, ప్రైవేట్ సంస్థ ప్రమేయం ఉండే అవకాశం, నిపుణుల కమిటీ విచారణకు ఆదేశించడంలో న్యాయస్థానం దృష్టి సారించింది'' అని పేర్కొంది.