Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడంలో ప్రభుత్వ సంస్థ ప్రమేయం వుందా లేదా అనే ప్రశ్నకు సుప్రీం కోర్టుకు స్పష్టమైన సమాధానం చెప్పడానికి కేంద్రం తిరస్కరించింది. ఈ ఎగవేత వైఖరి చూస్తుంటేనే ఈ విషయంలో వారి ప్రమేయం వుందని అంగీకరించినట్టు అవుతోందని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో పేర్కొంది. ఇదే అస్పష్టత విషయమై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తంగా స్తంభించిపోయాయి. ఈ అంశంపై నిర్దిష్టమైన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించడానికి జాతీయ భద్రతను ఒక సాకుగా చూపరాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినందువల్ల ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వాన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు కీలక చర్య తీసుకుంది. సంబంధిత వ్యక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ వారి అభిప్రాయాలను ఆహ్వానించాలి. ఈ గూఢచర్యానికి అంతర్జాతీయ సంబంధాలు వున్నందున సాక్ష్యం చెప్పేందుకు విదేశీ నిపుణులను కూడా ఆహ్వానించాలని పొలిట్‌బ్యూరో కోరింది. నిపుణుల కమిటీ తన విచారణను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేసింది.