Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్లో రైళ్లు నిలిపివేత .. కాన్పూర్ హైవే దిగ్బంధం
- రైతులు ఓపిక పట్టాలంటున్న శివరాజ్ సర్కార్
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఎరువులు దొరకటంలేదు. ఉధయం వచ్చి టోకెన్లు తీసుకుని క్యూలైన్లలో నిలబడినా..రాత్రి వరకూ ఎరువులు దక్కటంలేదంటూ రైతులు రోడ్డెక్కారు.కాన్పూర్లో హైవే దిగ్బంధించితే..సాగర్ జిల్లాలో రైళ్ల రాకపోకలను అడ్డుకునేలా పట్టాలపై బైటాయించారు. సకాలంలో ఎరువులు రాకపోతే వేసిన పంట నాశనమవుతుందనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతున్నది. అటు కేంద్రం,ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉండి కూడా ఎరువుల కొరత ఏర్పడటంతో..రైతునేతలు శివరాజ్ సర్కారను నిలదీస్తున్నారు. అయితే ఓపిక పట్టాలంటూ అక్కడి బీజేపీ ప్రభుత్వం రైతుల్ని కోరుతున్నది.
భోపాల్: ఎరువుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా మధ్యప్రదేశ్లో డీఏపీ కొరత తీరడం లేదన్నది వాస్తవం. రబీలో గోధుమలు, శనగలు, కందులు, ఆవాలు విత్తుకోవాల్సిన సమయంలో చాలా వరకు సహకార సంస్థల్లో ఎరువులు లేవు. రానున్న రోజుల్లో సమస్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. సాగర్ జిల్లాలోని బినా వద్ద రైతులు రైలును ఆపేశారు. కాన్పూర్ హైవేను దిగ్బంధించి ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని 3400 సహకార సంస్థల్లో ఎరువులు అంతంత మాత్రంగానే ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు సంఘాలు అంటున్నాయి. ఈ నెల 12 ర్యాకుల యూరియా, 5 ర్యాకుల డీఏపీ, 10 ర్యాకుల ఎన్పీకే కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం . కాగా 4.99 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపులు జరిగాయి. ఇప్పటి వరకు కేవలం 2.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం కాగా, 2.12 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, 1.33 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయి. ఇక్కడ ఉప ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిపెడితే..రైతులకు అందాల్సిన ఎరువుల కొరత ఎక్కడ కొంపముంచుతుందోనన్న భయం వెంటాడుతున్నది. మరో వైపు సీఎం శివరాజ్ సింగ్ మాత్రం రైతులు ఓపికపట్టాలని సూచిస్తున్నారు.
ఎరువు, డీఏపీ ఇక్కడ తయారు కాదు, బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి విదేశాల నుంచి కూడా రావడానికి కొంత సమయం పడుతుందని, అందుకే ఎరువు కొరత ఏర్పతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైనా బ్లాక్లో విక్రయించాలని ప్రయత్నిస్తే..కటకటాల వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని 52 జిల్లాలు ఉండగా..30 జిల్లాల్లో వ్యవసాయం మీద రైతు ఆధారపడి ఉన్నారు. అత్యధిక జిల్లాల్లో పంటలకు ఎరువులు తక్షణావసరం. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఓపికగా ఎలా ఉంటారని ప్రతిపక్షపార్టీలు అంటున్నాయి. యూరియా వేస్తే పంట పెరుగుతుందని రైతుల వాదన.రబీలో నాట్లు వేయటానికి ముందే ఎరువుల కొరతపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.