Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని మతాలు, కులాల వారినీ ఒక్కచోటకు చేర్చిన రైతు ఉద్యమం
- దేశ చరిత్రలో సుదీర్ఘకాలంపాటు నిరసనలు
- మోడీ సర్కార్ అణచివేతలు... ఆగని ఉద్యమం
- 11 నెలలుగా రైతు సమస్యలపై దేశవ్యాప్త చర్చ
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో మొదలైన రైతు ఉద్యమం కీలక దశకు చేరుకుంది. గత ఏడాది నవంబరు 26న సింఘు, టిక్రీ సరిహద్దుల్లో మొదలైన రైతు నిరసనలు దేశమంతా విస్తరించాయి. నూతన సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందేనని దేశమంతా ముక్త కంఠంతో నినదించింది. భిన్న మతాలు, కులాలు, అసమానతలు ఉన్న మనదేశంలో రైతు ఉద్యమం ప్రజలందర్నీ ఒక్కటి చేసిందని, రైతు సమస్యలు చర్చనీయాంశ మయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : నేడు భారతదేశంలో రైతులు చేస్తున్న పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మోడీ సర్కార్ చేసిన నూతన సాగు చట్టాలు ఎంత ప్రమాదకరమో అందరికీ చూపింది. రైతుల ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పటమేంది? అనే అంశం చర్చనీయాంశమైంది. రైతుల డిమాండ్లు ఏ ఒక్క రాష్ట్రానికో, ప్రాంతానికో సంబంధించినవి కాదు, ఇది దేశ ప్రజలందరి సమస్య అనే భావన రైతు ఉద్యమం కలిగించింది. అలాగే రైతు సమస్యలు, ఆందోళన పట్ల మోడీ సర్కార్ అసలు స్వరూపాన్ని ఉద్యమం బయటపెట్టింది. నియంతృత్వ పోకడలతో ఉద్యమాన్ని అణచివేసేందుకు మోడీ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. దీనిని ఎదుర్కొని ప్రజాశక్తితో ఎలా నిలబడాలో రైతు సంఘాలు చూపించాయి.
దేశ చరిత్రలో సుదీర్ఘకాలంగా నడిచిన ఉద్యమంగా ఇది నిలిచిపోయింది. ఈ ప్రయాణంలో దాదాపు 600మందికిపైగా నిరసనకారులు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి. మోడీ సర్కార్ అణచివేత, ఎండ, వాన, చలి..అనే ప్రతికూల వాతావరణం, ప్రధాన మీడియా దుష్ప్రచారాలు..ఇవన్నీ ఎదుర్కొని నిలబడటం మామూలు విషయం కాదు. 11 నెలల క్రితం ఉద్యమం కోసం బయల్దేరిన రైతులు, రైతు సంఘాల నాయకులు..ఇప్పటికీ అదే పోరాట పటిమతో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ ఈ ఉద్యమం సాధించిన విజయాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
శాంతియుత పంథాలో..
పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్..ఇలా వివిధ రాష్ట్రాల నుంచి బయల్దేరిన రైతులంతా ఢిల్లీ శివార్లకు చేరుకున్నారు. అక్కడ జాతీయ రహదార్ల వెంట టెంట్లు, డేరాలు ఏర్పాటుచేసుకొని శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొనకుండా కేంద్రం అనేక అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు కేసులతో రైతు నాయకుల్ని బెదిరించింది. అధికారిక మీడియాతో అవాస్తవాల్ని ప్రచారంలో పెట్టింది. అయినా ఉద్యమం ఆగలేదు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు గట్టిగా తేల్చిచెప్పాయి. స్వతంత్ర మీడియా ద్వారా ప్రజలకు రైతు ఉద్యమం వార్తలు చేరటం సరికొత్త పరిణామం. అధికార రాజకీయ పార్టీలు, కార్పొరేట్లు ప్రధాన మీడియాను హస్తగతం చేసుకున్న సంగతి ప్రజలకు స్పష్టంగా అర్థమైంది.
మతసామరస్యాన్ని చాటింది..
ప్రాంతాలకు, మతాలకు అతీతంగా రైతు ఉద్యమం సాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో 2013లో మత ఘర్షణలు చెలరేగాయి. అలాంటి నగరంలో రైతు నిరసనలు మొదలైతే..హిందువులు, ముస్లింలు అంతా కలిసి పాల్గొన్నారు. ఈనేపథ్యంలో జరిగిన సభల్లో రైతు సంఘాల నాయకులు మత సామరస్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. మతం, కులం, ప్రాంతం..పేరుతో రైతుల్లో చీలిక తీసుకొచ్చేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తుందని ముందుగానే హెచ్చరించారు. జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన పరిణామాల్ని గోడీ మీడియా(మోడీ సర్కార్ అనుకూల మీడియా) ఎలా చూపిందో అందరికీ తెలుసు. రైతుల్ని వేర్పాటువాదులుగా చిత్రీకరించింది.
సాగు గిట్టుబాటుగాక..
నిరసనలు, మహా పంచాయతీ సభలు..మొదలైన వాటిల్లో మహిళలు, దళితులు, జాట్లు, సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వీరంతా మత విద్వేషానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కుల కోసం నినదించటం అందర్నీ ఆకర్షించింది. రైతు కూలీలు, చిన్న సన్నకారు రైతుల కష్టాలు, సమస్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రతి రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ రైతుల సమస్యలపై దృష్టిసారించేట్టు చేయటంలో ఉద్యమం సఫలీకృతమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటీ..రెండు ఎకరాలున్న రైతులు సాగు చేయలేక నగరాలు, పట్టణాల్లో కూలీలుగా మారటం అందరికీ తెలిసిందే. వీరే కాదు 5 ఎకరాలు అంతకన్నా ఎక్కువున్న రైతులు కూడా సాగును వదిలేసే పరిస్థితి వచ్చిందని 77వ రౌండ్ ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఇటీవల తెలిపింది. వ్యవసాయేతర రంగాల్లో కూలీలుగా మారుతున్నారనే విషయాన్ని సర్వే బయటపెట్టింది. పండిన పంటకు మద్దతు ధర రాక రైతు రోడ్డున పడుతున్న సంగతి అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.